పహల్గామ్ ఉగ్రదాడి ఎఫెక్ట్.. హైదరాబాద్ ప్రయాణికులపై అదనపు భారం!
- భారత్-పాక్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- గగనతలాలు మూసేసిన భారత్, పాకిస్థాన్ దేశాలు
- హైదరాబాద్ నుంచి దుబాయ్, యూఎస్, యూకే వెళ్లేవారిపై ఎఫెక్ట్
- గంటన్నర నుంచి రెండున్నర గంటలు అదనపు ప్రయాణ సమయం
- టిక్కెట్ ధరలపైనా అదనపు భారం
దూరం పెరగడంతోపాటు ఆర్థిక భారం
ఈ పరస్పర నిషేధాల ఫలితంగా హైదరాబాద్ నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై ప్రత్యక్ష ప్రభావం పడింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్‌ప్రెస్ వంటి విమానయాన సంస్థలు హైదరాబాద్ నుంచి దుబాయ్, ఉత్తర అమెరికా, లండన్‌కు నడిపే సర్వీసుల షెడ్యూళ్లలో గురువారం నుంచి మార్పులు చేయాల్సి వచ్చింది. పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం లేకపోవడంతో ఈ విమానాలను ప్రత్యామ్నాయ, సుదీర్ఘ మార్గాల్లో మళ్లిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు గంటన్నర నుంచి రెండున్నర గంటల వరకు అదనపు సమయం పడుతోంది. పెరిగిన ప్రయాణ దూరం, ఇంధన వ్యయం కారణంగా టికెట్ ధరలపైనా భారం పడుతోంది.
కొంతకాలం భారం తప్పదు
హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి ఎమిరేట్స్, ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు ప్రతిరోజూ నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నాయి. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎప్పుడూ అధికంగా ఉంటుందని, సగటున 90 శాతం సీట్లు భర్తీ అవుతాయని విమానయాన సంస్థల ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ విమానాలు కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య గగనతల మార్గాలపై ఆంక్షలు కొనసాగుతున్నంత కాలం, హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి పశ్చిమ దేశాలకు ప్రయాణించే వారు ఈ అదనపు సమయాన్ని, కొంతమేర ఆర్థిక భారాన్ని మోయక తప్పని పరిస్థితి నెలకొంది. విమానయాన సంస్థలు ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సర్వీసులను కొనసాగిస్తున్నాయి.