ఇరాన్ నౌకపై ఉక్రెయిన్ దాడి.. తీవ్ర పరిణామాలుంటాయని టెహ్రాన్ హెచ్చరిక!
- దేశ భద్రతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమన్న ఇరాన్
- ఉక్రెయిన్ వైఖరిని ఐరోపా దేశాలు అడ్డుకోవాలని డిమాండ్
- రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ కు తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరిక
కాస్పియన్ సముద్రంలో ప్రయాణిస్తున్న తమ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ బలగాలు జరిపిన దాడిలో ఒక నావికుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ దేశ భద్రతను, ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన చర్యలకైనా వెనకాడబోమని స్పష్టం చేసింది. ఈ చర్యకు పాల్పడిన ఉక్రెయిన్‌కు రాబోయే రోజుల్లో తగిన శాస్తి జరుగుతుందని, యుద్ధం మరింత ముదరకుండా చూడాలంటే కీవ్ వైఖరిని ఐరోపా దేశాలు వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేసింది.
పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తమకు రష్యా-ఉక్రెయిన్ పోరుతో ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ పదేపదే చెబుతున్నప్పటికీ... రష్యా నుంచి ఇరాన్ శాటిలైట్ సమాచారాన్ని పొందుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. గల్ఫ్ ప్రాంతాలు, అమెరికా మిలిటరీ స్థావరాలపై రష్యా సేకరించిన ఉపగ్రహ చిత్రాలను ఇరాన్ తన దాడుల కోసం వాడుకుంటోందని వ్యాఖ్యానించారు. అమెరికా విధించిన ఆంక్షల వల్ల చైనా తదితర దేశాల నుంచి వస్తువుల రవాణాకు ఇరాన్‌కు ఈ కాస్పియన్ సముద్ర మార్గమే దిక్కుగా మారింది. అలాంటి కీలకమైన దారిలో నౌకపై దాడి జరగడం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది.
ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు చెర్నిహివ్, ఖార్కివ్ నగరాలపై రష్యా ఆదివారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఏకంగా 7 బాలిస్టిక్ మిస్సైళ్లు, 136 ఆత్మాహుతి డ్రోన్లతో రష్యా వైమానిక దాడికి తెగబడినట్లు ఉక్రెయిన్ ఆర్మీ వెల్లడించింది. ఈ దాడిలో ఆరుగురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.