ఎంతో ఉత్సాహం.. కొంత ఒత్తిడి: రీఎంట్రీపై రిషభ్ పంత్ వ్యాఖ్య
- 2022 నాటి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వికెట్ కీపర్ రిషభ్ పంత్
- 14 నెలల విరామం తరువాత ఐపీఎల్‌తో రీఎంట్రీకి సిద్ధం
- మళ్లీ అరంగేట్రం చేస్తున్నట్టు ఉందన్న పంత్
- బీసీసీఐకి, జాతీయ క్రికెట్ అకాడమీకి ధన్యవాదాలు చెప్పిన వైనం
2022 చివర్లో రోడ్డు ప్రమాదం కారణంగా పంత్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. యాక్సిడెంట్ కారణంగా అతడు దాదాపు 14 నెలలు ఆటకు దూరమయ్యాడు. పంత్ మళ్లీ క్రికెట్ ఆడటం దాదాపు అసాధ్యమని అప్పట్లో అతడికి చికిత్స చేసిన వైద్యులు భావించారట. కానీ పంత్ మాత్రం పట్టుదలతో కోలుకున్నాడు. ప్రమాదం తరువాత పంత్‌తో తన సంభాషణ గురించి డాక్టర్ దిన్షా పర్దవాలా గుర్తు చేసుకున్నారు. ‘నువ్వు మళ్లీ క్రికెట్ ఆడితే అదొక అద్భుతమే’ అని నేనన్నా. ఎందుకంటే అతడి మోకాలికి తీవ్ర స్థాయి ప్రమాదం జరిగింది. కానీ దానికి పంత్ బదులిస్తూ ‘నేను అద్భుతాలు చేసే వ్యక్తిని’ అని అన్నాడు అని బీసీసీఐ టీవీతో దిన్షా తెలిపారు.