బీఆర్ఎస్ వాళ్లకు మైక్ ఇవ్వండన్న రేవంత్ రెడ్డి.... మీరు బ్రేక్ తీసుకోండంటూ కేటీఆర్ రిప్లయ్
- అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్
- ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వండి.. వారికి తీసుకోవాలని ఉంటే ఇవ్వండని స్పీకర్‌కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
- కేటీఆర్‌కు మైక్ ఇచ్చిన సభాపతి
- రేవంత్ మాట్లాడి అలసిపోయారంటూ ఎద్దేవా
స్పీకర్ ప్రసాద్ కుమార్ మాజీ మంత్రి కేటీఆర్‌కు మైక్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... వారు (రేవంత్ రెడ్డి) మాట్లాడి మాట్లాడి అలసిపోయారని.. బ్రేక్ తీసుకోమనండి... అని ఎద్దేవా చేశారు.
ఢిల్లీని మేనేజ్ చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి టీపీసీసీ చీఫ్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ మాటలు తాను చెప్పడంలేదని... మేనేజ్మెంట్ కోటాలో వచ్చిందని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారని వెల్లడించారు.
అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సభ్యుడికి ఇలాగైనా పరివర్తన వస్తుందనుకున్నానని... సభ్యుడు ఈ ఒక్క అంశానికే (డ్రగ్స్)కే పరిమితమై చర్చించి మద్దతు ఇస్తారని భావించానని వ్యాఖ్యానించారు. కానీ తనను నిరాశపరిచారన్నారు. ఎప్పటి లాగే రాజకీయ ఆరోపణలు చేశారన్నారు. కాబట్టి తాను అన్నీ చెబుతానని రేవంత్ రెడ్డి అన్నారు.