అర్ధరాత్రి మాజీ మంత్రి బండారు నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. జిల్లాలో కలకలం
- వెన్నెలపాలెంలోని మాజీ మంత్రి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
- ఆయన నివాసానికి వెళ్లే మార్గంలో పలు చోట్ల బందోబస్తు
- విషయం తెలిసి బండారు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులు
- పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు
- అర్ధరాత్రి ఎందుకొచ్చారంటూ పోలీసులపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం
ఇటీవల మంత్రి రోజాపై బండారు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరవాడ డీఎస్పీ కె.వి. సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జెడ్సీటీసీ సభ్యులు పైల జగన్నాథరావు, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు బండారు ఇంటికి తరలివెళ్లారు. పరిసర గ్రామాలకు చెందిన మహిళలు కూడా వెళ్లారు. వారిని పోలీసుల ఎక్కడికక్కడ అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.