అవినీతికి పాల్పడ్డానని తేలితే ఉరేయండి: ప్రసన్నకుమార్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవినీతికి పాల్పడ్డానని తేలితే ఉరేయండి: ప్రసన్నకుమార్ రెడ్డి

Nallapareddy Prasanna Kumar Reddy Strong Warning to Nara Lokesh
  • తన దగ్గర  రూ.1,500 కోట్లు ఉంటే జిల్లాలో టీడీపీనే లేకుండా చేస్తాను: ప్రసన్నకుమార్ రెడ్డి
  • లోకేశ్ ఆరోపణలపై విచారణ జరపాలని సీఎం జగన్ ను కోరతానని వెల్లడి
  • లోకేశ్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు
టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కళ్లున్న వారికే అభివృద్ధి కనిపిస్తుందని, కళ్లు లేని బచ్చా లోకేశ్‌కి ఏమి తెలుస్తుందని మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడ్డానని నిరూపితమైతే ఉరేయాలని సవాల్ చేశారు. 

ఈ రోజు ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ చేసిన అవినీతి ఆరోపణలపై సీఎం జగన్ ను కలిసి సీబీఐ విచారణను కోరతానన్నారు. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. తన దగ్గర రూ.1,500 కోట్లు ఉంటే జిల్లాలో టీడీపీనే లేకుండా చేస్తానని స్పష్టం చేశారు. తమ కుటుంబానికి 16 వేల ఎకరాల భూమి ఉంటే నిరుపేదలకు పంచి పెట్టామని తెలిపారు.

‘‘నేను రూ.1,500 కోట్లు సంపాదించానని నిరూపితమైతే బుచ్చిరెడ్డిపాలెం నడిరోడ్డులో ఉరేయమని కోరుతున్నా.. ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణకు సిద్ధం” అని చెప్పారు. టీడీపీ నేతలు కళా వెంకట్రావు, బుచ్చయ్య చౌదరి, బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డిని తన ఇంటికి పంపితే.. తనకు సంబంధించిన ఆస్తి వివరాలు ఇస్తానన్నారు. తనకు వాళ్లంటే గౌరవం ఉందన్నారు. తాను అన్ని డాక్యుమెంట్లు ఇస్తానని.. వాళ్లే నిరూపిస్తారని చెప్పారు.

‘‘కళ్లున్న వారికే అభివృద్ధి కనిపిస్తుంది. కళ్లు లేని బచ్చా లోకేశ్‌కి ఏమి తెలుసు? ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. లోకేశ్ తాత రెండు ఎకరాలు పొలం చంద్రబాబుకు ఇస్తే ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?” అని ప్రశ్నించారు. తన గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలను అడిగితే చెబుతారన్నారు. స్థానిక ఎమ్మెల్యేలపై బురద జల్లినంత మాత్రాన చంద్రబాబు, లోకేశ్‌లను ప్రజలు నమ్మరన్నారు. లోకేశ్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు.
Advertisement
Nallapareddy Prasanna Kumar Reddy
Nara Lokesh
YSRCP
TDP Mahanadu
Chandrababu

More Telugu News