సముద్ర గర్భంలో పంచదార కొండలు... తాజా అధ్యయనంలో వెల్లడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సముద్ర గర్భంలో పంచదార కొండలు... తాజా అధ్యయనంలో వెల్లడి

Sugar mountains underneath sea grass meadows
  • సముద్రంలో భారీ మొత్తంలో పచ్చిక
  • పరిశోధన చేపట్టిన మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్
  • సముద్ర పచ్చిక కింద 1.3 మిలియన్ టన్నుల చక్కెర
  • భారీ మొత్తంలో కార్బన్ ను గ్రహించే సముద్ర పచ్చిక
  • పచ్చిక వేగంగా క్షీణిస్తోందన్న పరిశోధకులు
ప్రపంచ ప్రఖ్యాత మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు అత్యంత ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. మహాసముద్రాల గర్భంలో భారీ స్థాయిలో చక్కెర నిల్వలు ఉన్నాయని తెలిపారు. అవి పంచదార కొండలు అని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. సముద్ర గర్భంలోని పచ్చిక కింద అపారమైన చక్కెర నిక్షేపాలు ఉన్నట్టు వివరించారు. 

సాధారణంగా సముద్ర గర్భంలోని పచ్చిక కార్బన్ ను అత్యధిక మోతాదులో గ్రహిస్తుంది. పర్యావరణ వ్యవస్థలో కార్బన్ ఇంత మొత్తంలో స్వీకరించేది మరొకటి లేదు. ఈ నేపథ్యంలో, మాక్స్ ప్లాంక్ పరిశోధకులు సముద్ర పచ్చికపై పరిశోధనలు చేపట్టారు. ఒక చదరపు కిలోమీటరు పరిధిలోని సముద్ర పచ్చిక, భూమిపై అంతే పరిమాణంలో ఉన్న అటవీప్రాంతం కంటే రెండు రెట్లు అధికంగా కార్బన్ ను నిల్వ చేసుకుంటుందని గుర్తించారు. అంతేకాదు, 35 రెట్లు వేగంగా కార్బన్ ను గ్రహించగలదని తెలుసుకున్నారు. 

తమ అధ్యయనంలో భాగంగా ఈ సముద్ర పచ్చిక బయళ్ల కింది భాగాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు అద్భుతం అనదగ్గ అంశాన్ని గుర్తించారు. పెద్ద మొత్తంలో చక్కెర నిల్వలు ఆ మట్టిలో ఉన్నట్టు వెల్లడైంది. ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన మాన్యుయెల్ లీబెకె దీనిపై వివరణ ఇస్తూ... సముద్ర పర్యావరణ వ్యవస్థలో గతంలో గుర్తించిన చక్కెర నిక్షేపాల కంటే ఇది 80 శాతం అధికమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా ఉన్న సముద్ర చక్కెర పరిమాణం 1.3 మిలియన్ టన్నుల వరకు ఉంటుందని, ఇది 32 బిలియన్ క్యాన్ల కోకాకోలా పానీయంలోని చక్కెరకు సరిసమానం అని లీబెకె పేర్కొన్నారు. 

అయితే, చక్కెరకు ఇంత గొప్ప వనరుగా ఉన్న సముద్రపు పచ్చిక బయళ్లు వేగంగా తగ్గిపోతుండడం ఆందోళనకరమని తెలిపారు. ఇప్పటికే మూడొంతుల సముద్రపు పచ్చిక అంతరించిపోయిందని వివరించారు. 

ఇటువంటి సముద్ర పచ్చిక బయళ్లు క్షీణించిపోతుండడం వల్ల కార్బన్ ను అత్యధిక మొత్తంలో సంగ్రహించగల సముద్ర పర్యావరణ వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయని తమ పరిశోధనలో వెల్లడైందని లీబెకె వెల్లడించారు. తద్వారా 1.54 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతుందని, ఇది ఒక ఏడాదిలో 3.30 లక్షల కార్లు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ వాయువుకు సమానం అని వివరించారు. ఇది పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను ఎత్తిచూపుతుందని లీబెకె స్పష్టం చేశారు.
Sugar
Seagrass
Meadows
Max Planc Institute
Study

More Telugu News