మేయర్, ఛైర్ పర్సన్ల ఎన్నికలో ఓట్లు సమానమైతే.. లాటరీ ద్వారా విజేత ఎంపిక: ఎస్ఈసీ నాగిరెడ్డి
Add ap7am to your home Screen

మేయర్, ఛైర్ పర్సన్ల ఎన్నికలో ఓట్లు సమానమైతే.. లాటరీ ద్వారా విజేత ఎంపిక: ఎస్ఈసీ నాగిరెడ్డి

  • రేపు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి
  • సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వెల్లడి
  • ఈ నెల 27న మేయర్లు, ఛైర్ పర్సన్ల పరోక్ష ఎన్నికలు
రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించిన 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు జరుగనున్న ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో 74.40 శాతం, కార్పొరేషన్లలో 58.83 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయన్నారు. ఈ నెల 27న మేయర్లు, ఛైర్ పర్సన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఈ ఎన్నికలో ఓట్లు సమానంగా వస్తే.. లాటరీ ద్వారా విజేతను ఎంపిక చేస్తామని తెలిపారు. కరీంనగర్ మేయర్ ఎన్నిక ఈ నెల 29న జరుగుతుందన్నారు.

మేయర్, ఛైర్ పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఆయా పార్టీలు ఇవ్వడానికి గడువు తేదీలు వరసగా ఈ నెల 26, 27గా నిర్ణయించామన్నారు. ‘ఏ’ ఫారాలు 26న ఉదయం 11 గంటల్లోపు ఇవ్వాలని, ‘బీ’ ఫారాలు 27న ఉదయం 11 గంటల్లోపు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో ఉండే ప్రవర్తనా నియమావళి ఈ ఎన్నికలకు కూడా ఉంటుందన్నారు. రేపు సాయంత్రం నుంచి ఈ నియమావళి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ ఎన్నికలకు పార్టీలు తమ విప్ లను నియమించుకోవచ్చని పేర్కొన్నారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో ఓటు వేయవచ్చని మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి చెప్పారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక్కటే మున్సిపాలిటీ ఉంటే అక్కడే ఓటువేయవచ్చని.. అలాకాక ఒకటి కంటే ఎక్కువ మున్సిపాలిటీలుంటే.. ఓటు వేయడానికి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.
Telangana
CEC
Nagi reddy
Telangana Municipal Elections
Results

More Telugu News