అద‌ర‌గొట్టిన భార‌త అమ్మాయిలు.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్‌

అద‌ర‌గొట్టిన భార‌త అమ్మాయిలు.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి గోల్డ్ మెడల్‌

Indian Women Shine As India Wins First Gold Medal In Asian Games
  • ఆసియా క్రీడలు 2026లో భారత్‌కు తొలి స్వర్ణ పతకం
  • మహిళల క్రికెట్ ఫైనల్లో శ్రీలంకపై 147 పరుగుల ఘన విజయం
  • బ్యాటింగ్‌లో చెలరేగిన స్మృతి మంధాన (79), రిచా ఘోష్ (49నాటౌట్‌)
  • కేవలం 6 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన దీప్తి శర్మ
ఆసియా క్రీడలు 2026లో భారత్ బంగారు బోణీ కొట్టింది. మహిళల క్రికెట్ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ఏకంగా 147 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళల జట్టు తమ గోల్డ్ మెడల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది. ప్రస్తుత ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం.

ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 79 పరుగులు చేసి భారీ స్కోరుకు బలమైన పునాది వేసింది. 

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ ఆఖరి ఓవర్లలో విధ్వంసం సృష్టించింది. కేవలం 22 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 49 పరుగులు సాధించి జట్టు స్కోరును 200 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించింది. వీరిద్దరి మెరుపులతో లంక బౌలర్లకు చుక్కలు కనిపించాయి.

అనంతరం 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, భారత బౌలర్ల ధాటికి ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఆది నుంచే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయి కుప్పకూలింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో లంక బ్యాటర్లు పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. 

ముఖ్యంగా స్పిన్నర్ దీప్తి శర్మ తన మాయాజాలంతో లంక పతనాన్ని శాసించింది. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో శ్రీలంక జట్టు 69 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయాంక పాటిల్ చివరి వికెట్ తీయడంతో భారత శిబిరంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఆల్ రౌండ్ ప్రదర్శనతో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
Advertisement
Indian Womens Cricket Team
Asian Games 2026
Smriti Mandhana
Harmanpreet Kaur
India vs Sri Lanka Women Final
Deepti Sharma

More Telugu News