ఆ లెక్కలు బయటపెట్టాల్సిందే.. ఐపీఎల్ ట్రేడింగ్‌పై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు!

Sunil Gavaskar demands transparency in IPL trading financial details
  • హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేయనుందంటూ జోరుగా ప్రచారం
  • ఈ నేపథ్యంలో ఐపీఎల్ ట్రేడింగ్ విధానంపై స్పందించిన సునీల్ గవాస్కర్
  • ఆటగాళ్ల ట్రేడింగ్ సమయంలో ఆర్థిక వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్
  • పారదర్శకత ఉంటేనే ఐపీఎల్ ప్రతిష్ఠ‌ నిలబడుతుందని వ్యాఖ్య
  • కెప్టెన్‌గా హార్దిక్ విఫలం కావడంతోనే ట్రేడ్ వార్తలు ఊపందుకున్న వైనం
ఐపీఎల్ తర్వాతి సీజన్‌కు ముందు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భవితవ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ (ఎంఐ) అతడిని మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయనుందంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఐపీఎల్ ట్రేడింగ్ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల ట్రేడింగ్‌లో పూర్తి పారదర్శకత ఉండాలని, ఆర్థికపరమైన వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశాడు.

ఓ ప్రముఖ క్రీడా పత్రికకు రాసిన వ్యాసంలో గవాస్కర్ ఈ అంశాన్ని ప్రస్తావించాడు. "ప్రస్తుతం మీడియాలో ఆటగాళ్లు ఒక ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారడంపై కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఆటగాళ్ల బదిలీ జరిగినప్పుడు ఆ వివరాలు బహిరంగంగానే ఉంటాయి. కానీ, రెండు ఫ్రాంచైజీల మధ్య ట్రేడ్ (ఆటగాళ్ల మార్పిడి) జరిగినప్పుడు, ఆ ఆర్థికపరమైన లెక్కలు కేవలం ఆ రెండు జట్లకు, ఆటగాడికి, బీసీసీఐకి మాత్రమే తెలుస్తాయి" అని గవాస్కర్ పేర్కొన్నాడు.

ఈ రహస్యం వల్ల ఇతర ఫ్రాంచైజీలకు కీలక సమాచారం అందడం లేదని స‌న్నీ అభిప్రాయపడ్డాడు. "ఇలాంటి పరిస్థితుల్లో, ప్రతి జట్టుకు నిర్దేశించిన 'శాలరీ క్యాప్' (వేతన పరిమితి) నిబంధనను పాటించారా? లేదా ఉల్లంఘించారా? అనేది మిగతా ఫ్రాంచైజీలకు తెలియదు. అందుకే ట్రేడింగ్‌కు సంబంధించిన పూర్తి ఆర్థిక వివరాలను బహిరంగపరచడం చాలా ముఖ్యం" అని స్పష్టం చేశాడు. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్ అని, దాని ప్రతిష్టను కాపాడటానికి, దానిపై అసూయపడేవారు వేలెత్తి చూపకుండా ఉండేందుకు ఈ పారదర్శకత అత్యవసరమని గవాస్కర్ పేర్కొన్నాడు.

నేపథ్యం ఏమిటి?
2015లో ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా, 2022లో గుజరాత్ టైటాన్స్‌కు మారాడు. తన కెప్టెన్సీలో తొలి సీజన్‌లోనే గుజరాత్‌కు టైటిల్ అందించాడు. అయితే, 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ భారీ మొత్తానికి అతడిని తిరిగి ట్రేడ్ చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ, హార్దిక్ నాయకత్వంలో ముంబై దారుణంగా విఫలమైంది.

2024లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవగా, 2026 సీజన్‌లో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ పేలవ ప్రదర్శన కారణంగానే అతడిని ట్రేడ్ చేయాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం మధ్యలోనే ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో హార్దిక్ చిత్రాలను పోస్ట్ చేయడం గమనార్హం. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఐపీఎల్‌లో ట్రేడింగ్ విధానంపై కొత్త చర్చకు దారితీశాయి.
Advertisement
Sunil Gavaskar
Hardik Pandya
Mumbai Indians
IPL Trading Rules
BCCI Transparency
IPL 2025 News

More Telugu News