మీ రహస్యాలు ఏఐకి చెబుతున్నారా?.. ఈ 5 వివరాలు అస్సలు ఇవ్వొద్దు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ రహస్యాలు ఏఐకి చెబుతున్నారా?.. ఈ 5 వివరాలు అస్సలు ఇవ్వొద్దు!

AI Chatbots Are you sharing your secrets do not give these 5 details
  • ఏఐ చాట్‌బాట్‌లతో వ్యక్తిగత వివరాల షేరింగ్‌పై నిపుణుల హెచ్చరిక
  • పాస్‌వర్డ్, ఓటీపీ, బ్యాంక్ వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని సూచ‌న‌
  • ఆధార్, పాన్ వంటి ప్రభుత్వ ఐడీల విషయంలో జాగ్రత్త అవసరమ‌ని వెల్ల‌డి
  • కంపెనీ రహస్యాలు, క్లయింట్ డేటా పంచుకోవడం ప్రమాదకరమంటున్న నిపుణులు
సాంకేతికత మన జీవితంలో అంతర్భాగంగా మారింది. ఈమెయిల్స్ రాయడం నుంచి మొదలుకొని, బడ్జెట్ తయారు చేసుకోవడం, డాక్యుమెంట్లు విశ్లేషించడం వరకు అనేక పనులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్‌బాట్‌లను విరివిగా వాడుతున్నాం. అయితే, ఈ సౌకర్యం వెనుక ఓ పెద్ద ప్రమాదం దాగి ఉందని సైబర్‌ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం చాట్‌బాట్‌లతో జరిపే సంభాషణలను అవి రికార్డ్ చేస్తాయని, సమీక్షిస్తాయని, తమ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుకుంటాయని, ఇది దీర్ఘకాలంలో మన వ్యక్తిగత గోప్యతకు, భద్రతకు పెనుముప్పుగా పరిణమిస్తుందని స్పష్టం చేస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఏఐ చాట్‌బాట్‌లతో ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోకూడని ఐదు కీలకమైన సమాచార కేటగిరీలను నిపుణులు గుర్తించారు. అవెంటో ఒక‌సారి ఇప్పుడు మ‌నం చూద్దాం. 

1. పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు, అథెంటికేషన్ టోకెన్లు:
అనేకమంది తమ అకౌంట్ సమస్యల పరిష్కారం కోసం పాస్‌వర్డ్‌లు, వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (ఓటీపీలు), ఎర్రర్ లాగ్స్‌లో ఉండే సెషన్ టోకెన్ల వంటి సున్నితమైన సమాచారాన్ని చాట్‌బాట్‌లతో పంచుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. సమస్య పరిష్కారానికి చాట్‌బాట్‌లకు మీ అసలు లాగిన్ వివరాలు అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇలా షేర్ చేసిన డేటా సర్వర్ లాగ్స్‌లో నిల్వ ఉండి, భవిష్యత్తులో ఏదైనా సైబర్ దాడి జరిగితే బయటపడే ప్రమాదం ఉంది.

2. బ్యాంకింగ్, చెల్లింపుల వివరాలు:
ఖాతా వివరాలను విశ్లేషించడానికి లేదా బడ్జెట్ తయారు చేయడానికి ఏఐ సహాయం తీసుకున్నా, మీ బ్యాంక్ అకౌంట్ నంబర్లు, క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, సీవీవీ కోడ్‌లు, యూపీఐ ఐడీల వంటివి ఎప్పుడూ పంచుకోకూడదు. ఒకవేళ అలాంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి వస్తే, ఈ సున్నితమైన సమాచారాన్ని ముందుగా మాస్క్ చేయడం (బ్లాక్ చేయడం) లేదా వాటి స్థానంలో డమ్మీ వివరాలను చేర్చడం తప్పనిసరి. లేదంటే.. ఇది ఆర్థిక మోసాలకు, ఐడెంటిటీ దొంగతనానికి దారితీయవచ్చు.

3. ప్రభుత్వ గుర్తింపు పత్రాలు:
పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వ గుర్తింపు పత్రాలలో ఒక వ్యక్తికి సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ఈ పత్రాల అసలు కాపీలను అప్‌లోడ్ చేసి, వాటిలోని నంబర్లు, చిరునామాలు, పుట్టిన తేదీలు, సంతకాలను మాస్క్ చేయకుండా సహాయం కోరడం ఐడెంటిటీ దొంగతనానికి ఆస్కారం కల్పిస్తుంది.

4. కార్యాలయ రహస్య సమాచారం:
కంపెనీ అంతర్గత వ్యూహాలు, క్లయింట్ డేటా, ఆర్థిక నివేదికలు, ప్రాజెక్ట్ ప్లాన్‌లు, సోర్స్ కోడ్, మీటింగ్ నోట్స్ వంటి రహస్య సమాచారాన్ని పబ్లిక్ చాట్‌బాట్‌లలో పేస్ట్ చేయడం వల్ల ఇప్పటికే కొన్ని కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ కారణంగా పలు సంస్థలు తమ ఉద్యోగులు ఏఐ టూల్స్ వాడకంపై ఆంక్షలు లేదా నిషేధం విధించాయి. నిర్దిష్ట పేర్లు, అంకెల స్థానంలో సాధారణ పదాలను వాడితే సమాచార గోప్యతకు భంగం కలగకుండా సహాయం పొందవచ్చు.

5. ఇతరుల వ్యక్తిగత సమాచారం:
మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేదా సహోద్యోగుల ఫోన్ నంబర్లు, వ్యక్తిగత సమస్యలు, వారి డాక్యుమెంట్లు వంటివి వారి అనుమతి లేకుండా ఏఐ చాట్‌బాట్‌లతో పంచుకోవడం నైతికంగా, చట్టపరంగా నేరం. ఇది వారి గోప్యతా హక్కును ఉల్లంఘించడమే అవుతుంది.

వీటితో పాటు వైద్య రికార్డులు, లొకేషన్ మెటాడేటా ఉండే వ్యక్తిగత ఫోటోలు, మేధో సంపత్తికి సంబంధించిన అంశాలను కూడా చాట్‌బాట్‌లతో పంచుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారులు ప్రత్యేకంగా 'ఆప్ట్-అవుట్' చేసుకోకపోతే, ప్రముఖ ఏఐ సంస్థలు ఈ సంభాషణల డేటాను తమ మోడళ్ల శిక్షణ కోసం వాడుకుంటాయని స్టాన్‌ఫర్డ్ పరిశోధకులు గతంలోనే వెల్లడించారు. అందుకే ఏఐని వాడుతున్నప్పుడు సౌకర్యంతో పాటు భద్రతకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరం.
Advertisement
AI Chatbots
Cyber Security
Data Privacy
Identity Theft
Online Safety
Personal Information

More Telugu News