జితేంద్ర అన్‌లక్కీ అనుకున్న బంగ్లా.. ఇప్పుడు రూ.450 కోట్ల ఆస్తి!

Jeetendra Unlucky Bungalow Now Worth 450 Crores
  • లెజెండరీ నటుడు భరత్ భూషణ్ నుంచి బంగ్లా కొన్న జితేంద్ర
  • సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అన్‌లక్కీ అని భావించి ఇల్లు ఖాళీ చేసిన వైనం
  • పాత బంగ్లా స్థానంలో అపార్ట్‌మెంట్లు నిర్మించి విక్రయం
  • నేడు ఆ స్థలం విలువ రూ. 450 కోట్లు అని జితేంద్ర వెల్లడి
బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్ర తన జీవితంలో జరిగిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఒకప్పుడు 'అదృష్టం లేదు' అని భావించి వదిలేసిన ఓ బంగ్లా, ఇప్పుడు రూ.450 కోట్ల విలువైన ఆస్తిగా ఎలా మారిందో ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

ముంబైలోని గిర్గామ్‌లో ఓ చిన్న ఇంట్లో (చాట్) 8 మంది కుటుంబ సభ్యులతో నివసించేవాడినని జితేంద్ర గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో పాలి హిల్ లాంటి ఖరీదైన ప్రాంతంలో ఇల్లు కొనాలనేది తన కల అని చెప్పారు. అదే సమయంలో ప్రముఖ నటుడు భరత్ భూషణ్ ఆర్థిక ఇబ్బందుల వల్ల తన పాలి హిల్ బంగ్లాను అమ్మకానికి పెట్టారు. 3,450 చదరపు అడుగుల స్థలంతో ఉన్న ఆ బంగ్లాను జితేంద్ర రూ.4.25 లక్షలకు కొనుగోలు చేశారు.

అయితే, ఆ ఇంట్లోకి మారిన తర్వాత ఆయన నటించిన నాలుగు సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. దీంతో ఆ ఇల్లు తనకు కలిసి రావడం లేదనే భయంతో, కెరీర్ ముగిసిపోతుందేమోనని ఆందోళన చెంది ఆ బంగ్లాను ఖాళీ చేశారు. కొన్నేళ్ల తర్వాత అదే స్థలాన్ని రీడెవలప్‌మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. పాత బంగ్లాను కూల్చివేసినప్పుడు, అందులోని బర్మా టేకు కలపను అమ్మగా ఊహించని విధంగా రూ.11.5 లక్షలు వచ్చాయి. అంటే, బంగ్లా కొన్న ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ మొత్తం కేవలం కలప ద్వారానే లభించడం విశేషం.

ఆ స్థలంలో 'గౌతమ్ అపార్ట్‌మెంట్స్' నిర్మించి, అప్పట్లో చదరపు అడుగుకు కేవలం రూ.85 చొప్పున ఫ్లాట్లను అమ్మినట్లు జితేంద్ర తెలిపారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో చదరపు అడుగు ధర రూ.85,000 పలుకుతోందని ఆయన కుమారుడు, నటుడు తుషార్ కపూర్ చెప్పినట్లు పేర్కొన్నారు. కేవలం ఆ స్థలం విలువే నేడు సుమారు రూ.450 కోట్లు ఉంటుందని జితేంద్ర వెల్లడించారు.
Advertisement
Jeetendra
Pali Hill Bungalow
Jeetendra Property Value
Bollywood Real Estate
Jeetendra Net Worth
Mumbai Luxury Property

More Telugu News