ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌లపై స్టే ఎత్తివేతకు నిరాకరణ
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డేంజర్ బెల్స్ మోగుతున్నాయన్న తెలంగాణ హైకోర్టు
- ఉచిత పథకాలకు నిధుల మళ్లింపు వల్ల అత్యవసర రంగాలపై ప్రభావం పడుతోందని వ్యాఖ్య
- నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తే ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని వ్యాఖ్య
తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల చట్టబద్ధత, ఉచిత పథకాలకు నిధుల వినియోగంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పథకాల నిధుల విడుదలపై ఉన్న మధ్యంతర స్టేను ఎత్తివేసేందుకు జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం నిరాకరించింది.
అలాగే, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు అందాల్సిన పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సమయానికి చెల్లించలేక పోవడంతో వారు న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాధనాన్ని ఈ విధంగా వాడటానికి బదులు భూబాధితులకు సకాలంలో పరిహారం ఇచ్చి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే అసలు ఇటువంటి పథకాల అవసరమే ప్రజలకు ఉండదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాట పట్టించి, ఆ ఆదాయంతో సంక్షేమం చేపట్టవచ్చని సూచిస్తూ, సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.