ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు.. వెంట‌నే వారి కాంట్రాక్టులు క‌ట్ చేయండి.. అప్పుడే దారికి వ‌స్తారు: గ‌వాస్క‌ర్‌

Sunil Gavaskar demands BCCI cut contracts of players taking IPL lightly
  • ఐపీఎల్ మధ్యలో వెళ్లిపోయే విదేశీ ఆటగాళ్లపై కఠినంగా ఉండాలన్న గవాస్కర్
  • గాయాల పేరుతో తప్పించుకుని ఇతర టోర్నీల్లో ఆడేవారిని నిషేధించాలని సూచన
  • ఆటగాళ్ల ఫీజుతో పాటు విదేశీ బోర్డులకు ఇచ్చే కమీషన్‌లోనూ కోత పెట్టాలని డిమాండ్
  • కొందరు ఆటగాళ్లు, బోర్డులు ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నాయని విమర్శ
  • ఫ్రాంచైజీల నిస్సహాయతను బలహీనతగా చూడొద్దని హెచ్చరిక
ఐపీఎల్ మధ్యలో గాయాల పేరుతో తప్పుకుని, ఆ తర్వాత ఇతర పోటీల్లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన వైఖరి అవలంబించాలని సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశాడు. ఇలాంటి ఆటగాళ్ల వల్ల ఫ్రాంచైజీలు తీవ్రంగా నష్టపోతున్నాయని, వారి ప్రయోజనాలను కాపాడేందుకు బీసీసీఐ పటిష్ఠమైన నిబంధనలు తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో పలువురు ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'స్పోర్ట్‌స్టార్' పత్రికలో రాసిన తన కాలమ్‌లో గవాస్కర్ ఈ అంశాన్ని ప్ర‌ముఖంగా ప్రస్తావించాడు. "వేలంలో పాల్గొని, ఎంపికయ్యాక గాయం కాకుండా తమ దేశ మీడియాను ప్రసన్నం చేసుకోవడం కోసం చివరి నిమిషంలో తప్పుకునే వారిపై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించడం మంచి నిర్ణయం. అదే విధంగా ఐపీఎల్‌కు వచ్చి, తుది జట్టులో రెగ్యులర్‌గా చోటు దక్కడం లేదని గ్రహించి, గాయమైందని చెప్పి స్వదేశానికి తిరిగి వెళ్లి, ఐపీఎల్ ఇంకా కొనసాగుతుండగానే తమ దేశవాళీ క్రికెట్ ఆడే వారిని కూడా నిషేధించాలి" అని గవాస్కర్ ఘాటుగా రాసుకొచ్చాడు.

కొందరు విదేశీ ఆటగాళ్లు, వారి క్రికెట్ బోర్డులు ఐపీఎల్‌ను తేలికగా తీసుకుంటున్నాయని గవాస్కర్ విమర్శించాడు. "చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు. కొన్నిసార్లు వారి బోర్డులతో కుమ్మక్కై, ఏదోఒక సాకు చెప్పి, వేలానికి ముందు అంగీకరించినట్లుగా పూర్తి టోర్నమెంట్‌లో ఆడటం లేదు. చివరి నిమిషంలో ఫ్రాంచైజీలు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల కోసం పరుగులు తీయలేవు. దీంతో ఆయా బోర్డులు తమ ఆటగాడిని విడుదల చేసే వరకు ఎదురుచూడటం తప్ప మరో మార్గం ఉండదు" అని స‌న్నీ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆర్థికపరమైన అంశాన్ని కూడా గవాస్కర్ ప్రస్తావించాడు. "ఆటగాడి ఫీజులో 10 శాతం ఆయా దేశాల బోర్డులకు అందుతుంది. ఇది ఫ్రాంచైజీకి అదనపు భారం. అందుకే బీసీసీఐ ఈ విషయంలో కఠినంగా ఉండాలి. ఆటగాడు ఎన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉంటే, ఆ నిష్పత్తిలో అతని ఫీజులో కోత విధించాలి. అదేవిధంగా విదేశీ బోర్డులకు ఇచ్చే శాతంలో కూడా కోత వర్తింపజేయాలి" అని సూచించాడు.

"క్రికెట్ ప్రపంచాన్ని పాత శక్తులే ఇన్నాళ్లు ఏలాయి. అవి ఇతర బోర్డులకు ఏమీ ఇవ్వలేదు. కానీ ఇక్కడ బీసీసీఐ ఇతర బోర్డులకు కూడా ఇస్తోంది. అందుకే ఫ్రాంచైజీల నిస్సహాయతను బలహీనతగా చూడవద్దని ఆ బోర్డులకు బీసీసీఐ స్పష్టంగా చెప్పాలి. పూర్తి టోర్నమెంట్ ఆడటానికి ఇష్టపడని వారి కాంట్రాక్టులను రద్దు చేయాలి. ఇందులో ఎలాంటి రాజీ ఉండకూడదు. ఇది ఐపీఎల్, ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 టోర్నమెంట్ మాత్రమే కాదు, చాలా సాధారణ విదేశీ ఆటగాళ్లను కూడా కోటీశ్వరులను చేసిన వేదిక" అని గవాస్కర్ స్ప‌ష్టం చేశాడు.
Go Back to Shorts
Sunil Gavaskar
BCCI
IPL Foreign Players
IPL Player Contracts
Indian Premier League
Cricket News

More Telugu News