కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- తెలంగాణ కోర్టు కేసు వివరాలు దాచిపెట్టారని బీజేపీ అభ్యంతరం
- ఇది కేసు కాదని, కేవలం నోటీసు మాత్రమేనని వాదించిన కాంగ్రెస్
- గాంధేయవాద మహిళను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత విమర్శ
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కోర్టులో మీనాక్షి నటరాజన్‌పై ఒక పిటిషన్ దాఖలైంది. లైంగిక వేధింపులు, ప్రాణహాని బెదిరింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి మీనాక్షి రాజకీయ అండదండలు అందించారని ఎ.శ్రీలత అనే మాజీ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఆ పిటిషన్లో ఆరోపించారు. ఈ విషయాన్ని నామినేషన్లో ప్రస్తావించలేదని బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ నేత ఉమంగ్ సింఘార్ "బలవంతపు రాజకీయాలు"గా అభివర్ణించారు. మీనాక్షిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నుంచి నోటీసు మాత్రమే అందిందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కేసు నమోదైతేనే వివరాలు వెల్లడించాలి తప్ప, నోటీసుకు కాదని వాదించారు. ఇదంతా తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు చేస్తున్న రాజకీయ కుట్ర అని మీనాక్షి నటరాజన్ అన్నారు.
"ఒక గాంధేయవాద మహిళను చూసి బీజేపీ భయపడుతోంది" అని ఉమంగ్ సింఘార్ ఎక్స్ వేదికగా విమర్శించారు. "వారి నినాదం 'నారీ వందన్', కానీ నైజం 'నారీ అపమాన్'.. ఇదే బీజేపీ అసలు స్వరూపం" అని దుయ్యబట్టారు. సత్యం, రాజ్యాంగం, ప్రజాభిప్రాయం శక్తితో తాము విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా కొనసాగుతుండడం తెలిసిందే.