డ్రోన్ దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు.. రష్యా సదస్సులో నిబద్ధత చాటుకున్న లోకేష్
- రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సుకు హాజరైన మంత్రి నారా లోకేష్
- సదస్సు ప్రారంభానికి ముందు సెయింట్ పీటర్స్‌బర్గ్‌పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు
- దాడులు జరిగినా ముందుగా నిర్ణయించిన పర్యటనను కొనసాగించిన లోకేష్
- ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం
- పెట్టుబడిదారులకు ఇచ్చిన మాటకే కట్టుబడినట్లు వెల్లడి
సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం (SPIEF) ప్రారంభానికి ముందు జరిగిన ఈ డ్రోన్ దాడులతో నగరం చుట్టూ హై-సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించారు. ఆ సమయంలో లోకేష్, పలువురు పెట్టుబడిదారులతో సమావేశాల కోసం మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలోనే ఆయనకు దాడుల గురించి సమాచారం అందింది. దీంతో భద్రతాపరమైన సమీక్షలు జరిగాయి.
అయినప్పటికీ లోకేష్ వెనక్కి తగ్గలేదు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం సదస్సుకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతున్న తరుణంలో, ప్రభుత్వాలు ఇచ్చే హామీలు, వాటిని నిలబెట్టుకునే విశ్వసనీయత చాలా ముఖ్యం. ఇది కేవలం ప్రదర్శన కోసం తీసుకున్న నిర్ణయం కాదని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిన వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే దృఢ సంకల్పంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భద్రతా హెచ్చరికల నడుమ సదస్సుకు చేరుకున్న లోకేష్, తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు. పలువురు ఇన్వెస్టర్లు, వ్యాపార దిగ్గజాలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలను వివరించారు. డ్రోన్ దాడుల వార్తలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసినా, ఏపీ ప్రగతికి అంతరాయం కలగకూడదనే సంకల్పంతో లోకేష్ ముందుకు సాగారు.