రాహుల్ 'ఆర్థిక సునామీ' వ్యాఖ్యలు.. భయాన్ని సృష్టించవద్దని బీజేపీ హెచ్చరిక

BJP Fact Checks Rahul Gandhi Economic Tsunami Claim
  • దేశంలో ఆర్థిక సునామీ తప్పదని రాహుల్ గాంధీ హెచ్చరిక
  • ఇది కేవలం భయాన్ని సృష్టించడమేనని తిప్పికొట్టిన బీజేపీ
  • దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని పలు గణాంకాలు విడుదల
  • ఎమర్జెన్సీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ గత చరిత్రను గుర్తుచేసిన నేతలు
దేశంలో త్వరలో 'ఆర్థిక సునామీ' రాబోతోందని, ప్రభుత్వం ఎమర్జెన్సీ తరహా పరిస్థితులను ప్రకటించవచ్చని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇవి కేవలం ప్రజల్లో భయాన్ని సృష్టించే ప్రయత్నాలని, భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సవాళ్లను తట్టుకుని పటిష్ఠంగా ఉందని స్పష్టం చేసింది.

బుధవారం కాంగ్రెస్ గిరిజన విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దేశంలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తప్పదని హెచ్చరించారు. గతంలో ఆర్థిక ఒత్తిళ్ల నుంచి దేశాన్ని కాపాడిన వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతను అణచివేసేందుకు ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

రాహుల్ ఆరోపణలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యలు తప్పు మాత్రమే కాదు, ఇది కచ్చితంగా భయాన్ని వ్యాప్తి చేయడమేనని విమర్శించారు. గత దశాబ్ద కాలంలో ఆర్థిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేశామని పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగం, వాహన అమ్మకాలు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, భారీ విదేశీ మారక నిల్వలు వంటివి ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. సునామీ 2013లో వచ్చిందని, ఇప్పుడు కాదని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ ఈ దేశంలో వినాశనాన్ని సృష్టిస్తే, బీజేపీ దృఢంగా ముందుకు సాగుతోందని అన్నారు. 

కేంద్రమంత్రి, జేడీ(యూ) నేత లలన్ సింగ్ స్పందిస్తూ, రాహుల్ గాంధీకి ఆయన నాయనమ్మ ఇందిరా గాంధీ విధించిన 1975 ఎమర్జెన్సీని గుర్తుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. రాహుల్ పదేపదే ఇలాంటి హెచ్చరికలు చేస్తూ అస్థిరత సృష్టించాలని చూస్తున్నారని పలువురు బీజేపీ నాయకులు విమర్శించారు.
Go Back to Shorts
BJP Fact Checks Rahul Gandhi 'Economic Tsunami Claim
Stop Selling Panic

More Telugu News