ఇళయరాజాకు 'కరుప్పు' టీమ్ క్షమాపణ

Karuppu Team Apologizes to Ilayaraja
  • సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' సినిమా
  • సినిమాలో ఇళయరాజాను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగులు
  • ఇళయరాజాను అగౌరవపరచడం తమ ఉద్దేశం కాదన్న చిత్ర యూనిట్

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, అగ్ర నటి త్రిష జంటగా నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’). టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ కలెక్షన్లతో, హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. హీరో సూర్య కెరీర్‌లో ఇదొక పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ హిట్‌గా నిలిచింది. అయితే, ఒకవైపు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తున్నప్పటికీ.. మరోవైపు ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి.


ఈ చిత్రంలో భారతీయ సంగీత ప్రపంచంలోనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొందిన ఇళయరాజాను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగులు ఆయన స్థాయిని, గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, ఆయన అభిమానులు చిత్ర బృందంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వివాదం ముదురుతుండటంతో ‘కరుప్పు’ మూవీ టీమ్ స్పందించింది. ఇళయరాజాకు క్షమాపణలు చెబుతూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.


ఇళయరాజాపై తమకు ఎంతో గౌరవం ఉందని, భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలు... ఎందరో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎన్నో తరాలుగా స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయని చిత్ర బృందం పేర్కొంది. సినిమాలో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న ఒక డైలాగ్ వల్ల ఆయన బాధ పడ్డారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల తాము ఇళయరాజాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. ఆయనను అగౌరవపరచడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు.


వివాదానికి కారణమైన ఆ నిర్దిష్ట సీన్లను, డైలాగులను సినిమాలోంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. థియేటర్లలో ఈ రోజు నుంచే ఆ మార్పులు అమలులోకి వస్తాయని వెల్లడించారు. చలనచిత్ర పరిశ్రమలో అందరి గౌరవమే తమకు ప్రధానమని.. కాబట్టి, దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. దీనిని మరింత కాంట్రవర్సీగా మార్చి సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు వార్తలను, ఊహాగానాలను సృష్టించవద్దని వారు వేడుకున్నారు.

Go Back to Shorts
Ilayaraja
Karuppu movie
RJ Balaji
Suriya
Trisha
Kollywood
Veerabhadradu
Tamil cinema
Telugu cinema
Movie dialogues controversy

More Telugu News