RBI: మొబైల్ నంబర్ లాగే ఇక బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ!

RBI Plans Bank Account Portability Like Mobile Number Portability
షార్ట్స్‌లో చూడండి
భారతీయ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) శ్రీకారం చుట్టనుంది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ తరహాలోనే, వినియోగదారులు తమ బ్యాంకు ఖాతా నంబర్‌ను మార్చుకోకుండానే ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మారే సౌలభ్యాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. ఆర్‌బీఐ ఇటీవల ఆవిష్కరించిన 'పేమెంట్స్ విజన్ 2028' డాక్యుమెంట్‌లో ఈ కీలక ప్రతిపాదనను చేర్చింది. ఇది అమల్లోకి వస్తే, బ్యాంకింగ్ సేవల్లో కస్టమర్లకు మరింత స్వేచ్ఛ లభించనుంది.

ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆర్‌బీఐ 'పేమెంట్స్ స్విచ్చింగ్ సర్వీస్' (PaSS) అనే కేంద్రీకృత టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందిస్తోంది. దీని ద్వారా కస్టమర్ ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు మారినప్పుడు, వారి ఈఎంఐలు, సిప్‌లు, ఇతర ఆటో-డెబిట్ చెల్లింపుల ఆదేశాలు (mandates) అన్నీ ఆటోమేటిక్‌గా కొత్త బ్యాంకుకు బదిలీ అవుతాయి. దీంతో వినియోగదారులు ప్రతిచోటా తమ ఖాతా వివరాలను మాన్యువల్‌గా మార్చుకోవాల్సిన శ్రమ తప్పుతుంది.

ప్రస్తుతం బ్యాంకును మార్చడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. జీతం ఖాతా, పెట్టుబడులు, ప్రభుత్వ పథకాలతో ముడిపడి ఉండటంతో చాలామంది ఇష్టం లేకపోయినా పాత బ్యాంకులోనే కొనసాగుతున్నారు. ఈ కొత్త విధానం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే బ్యాంకును సులభంగా ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఇది బ్యాంకుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచి, సేవల నాణ్యతను మెరుగుపరచడానికి దోహదపడుతుంది.

అయితే, ఖాతా నంబర్ మారకపోయినా కొత్త బ్యాంకుకు సంబంధించిన ఐఎఫ్‌ఎస్‌సీ (IFSC) కోడ్ మారుతుంది. పాత బ్యాంకులో ఉన్న లోన్లు, ఇతర ఆర్థిక బాధ్యతలు, క్రెడిట్ హిస్టరీ వంటివి యథాతథంగా కొనసాగుతాయి. ఈ పోర్టబిలిటీ కేవలం ఖాతా మార్పును సులభతరం చేస్తుంది కానీ, బాధ్యతలను తొలగించదు. కస్టమర్లకు సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఆర్‌బీఐ ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
Go Back to Shorts
RBI
Reserve Bank of India
Bank Account Portability
Payments Vision 2028
Payments Switching Service
PaSS
IFSC Code
Banking Services
Auto Debit
Customer Service

More Telugu News