KTR: బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సిగ్గులేకుండా వారి ఖాతాలో వేసుకుంటున్నారు: కేటీఆర్

KTR Slams Congress for Claiming BRS Job Achievements
షార్ట్స్‌లో చూడండి
బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక దానికి పాతరేశారని మండిపడ్డారు. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులను నయవంచన చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందన్న డిమాండ్లతో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీఆర్ఎస్‌ విద్యార్థి నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని కేటీఆర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలోనైనా నిధులు విడుదల చేయాల్సిందిపోయి, ప్రశ్నించిన గొంతుకలపై ఉక్కుపాదం మోపడం రాష్ట్రంలో ఎమర్జెన్సీ వాతావరణాన్ని తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీల అమలు కోసం విద్యార్థులు అసెంబ్లీని ముట్టడించాల్సిన దుస్థితిని కల్పించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలని హితవు పలికారు.

విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యం వల్లే రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో 127 మంది విద్యార్థులు మరణించినా ముఖ్యమంత్రిలో కనీస చలనం లేదని, ఇప్పటివరకు దానిపై స్పందించకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి బకాయిపడ్డ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాటను మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలోనైనా నిలబెట్టుకోవాలని సూచించారు. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్‌వి నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Go Back to Shorts
KTR
K Taraka Rama Rao
BRS
Congress Government
Job Calendar
Telangana Jobs
Fee Reimbursement
Scholarships
Student Protests
Revanth Reddy

More Telugu News