Nara Lokesh: యువగళం హామీలు నిలబెట్టుకున్నా.. శెట్టిబలిజలకు అండగా ఉంటా: మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh about Shettibalijas
షార్ట్స్‌లో చూడండి
శెట్టిబలిజల ఆరాధ్య దైవం, సంఘ సంస్కర్త దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలను, ముఖ్యంగా శెట్టిబలిజలను లక్ష్యంగా చేసుకుని వెంటపడి వేధించారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభకు లోకేశ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రానున్న ఆరు నెలల్లో బోడసకుర్రులో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, శెట్టిబలిజల కోసం రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని కీలక ప్రకటన చేశారు.

దొమ్మేటి జీవితం ఆదర్శం 
దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం గర్వంగా ఉందని లోకేశ్ అన్నారు. "బ్రిటిష్ పాలనలో బర్మా వలస వెళ్లిన శెట్టిబలిజలలో దొమ్మేటి ఒకరు. సాధారణ వ్యక్తిగా వెళ్లి, షిప్పింగ్ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి షిప్‌లకు ఓనర్ అయ్యారు. ఆ తర్వాత బర్మాకు మేయర్‌గా సేవలు అందించారు. అక్కడి శెట్టిబలిజల కష్టాలు చూసి, వారిలో చైతన్యం నింపేందుకు శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. విద్య విలువను గుర్తించి పిల్లల కోసం స్కూళ్లు, నైట్ స్కూళ్లు ప్రారంభించారు. ఆ తర్వాత జన్మభూమికి తిరిగివచ్చి బోడసకుర్రు జమీందార్‌గా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడమే కాక, స్కూళ్లు, కాలేజీలు, లైబ్రరీల కోసం తన సొంత భూములు, నిధులు విరాళంగా ఇచ్చారు" అని ఆయన స్మరించుకున్నారు.

యువగళం హామీలు నెరవేర్చా 
యువగళం పాదయాత్రలో శెట్టిబలిజ సోదరులు తనను కలిసి దొమ్మేటి జయంతిని ప్రభుత్వ పండుగగా చేయాలని కోరారని, ప్రజా ప్రభుత్వం రాగానే ఆ మాట నిలబెట్టుకున్నానని లోకేశ్‌ తెలిపారు. పాదయాత్ర సమయంలోనే దొమ్మేటి గొప్పతనం పూర్తిగా తెలుసుకున్నానని, మద్యం షాపుల్లో 10 శాతం శెట్టిబలిజలకు కేటాయిస్తామన్న హామీని కూడా నెరవేర్చామని గుర్తుచేశారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం కల్లుగీత ఫెడరేషన్, ఆదరణ పథకాలతో కార్మికులను ఆదుకుంటే, 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం 'జె-బ్రాండ్స్'తో వారి జీవితాలను దెబ్బతీసిందని విమర్శించారు.

వైసీపీ పాలనలో దాడులు.. మేం అండగా నిలిచాం 
"గత ఐదేళ్లలో బీసీలపై వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. తన అక్కను ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. పల్నాడులో తమకు జై కొట్టలేదని తోట చంద్రయ్యను కిరాతకంగా చంపేశారు. ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్యను హతమార్చారు. మేం ఆ బాధితుల కుటుంబాలకు అండగా నిలిచాం. నందం సుబ్బయ్య బిడ్డలను, అమర్నాథ్ గౌడ్ సోదరిని చదివిస్తున్నాం. తోట చంద్రయ్య బిడ్డకు పది రోజుల్లో ఉద్యోగం ఇస్తాం" అని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని అన్నారు.

బోడసకుర్రు బ్రిడ్జికి దొమ్మేటి వెంకటరెడ్డి పేరు పెట్టే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు. చెట్టు పైనుంచి పడిన గీత కార్మికులను ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ముతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణ బాబు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Shettibalijas
Andhra Pradesh
AP News

More Telugu News