Nara Lokesh: దేవుడంటే మా కుటుంబానికి అపారమైన గౌరవం... వైసీపీ నేతలకు సిగ్గుండాలి: మండలిలో నారా లోకేశ్ ఫైర్

Nara Lokesh Fires at YCP Leaders Over Tirumala Laddu Adulteration Allegations
  • గత పదేళ్లుగా తిరుమలలో దేవాన్ష్ పేరిట అన్నదానం చేస్తున్నామని లోకేశ్ వెల్లడి
  • మండలిలో లడ్డూ కల్తీ అంశంపై వైసీపీ సభ్యుల ఆరోపణలను తిప్పికొట్టిన వైనం
    ఆధారాల్లేకుండా హెరిటేజ్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
    సీబీఐ ఛార్జిషీట్ లో నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టంగా ఉందని వెల్లడి
    జగన్ కనీసం డిక్లరేషన్ పై సంతకం కూడా పెట్టలేదని ధ్వజమెత్తిన మంత్రి
తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ అంశంపై చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవుడంటే తమ కుటుంబానికి అపారమైన గౌరవం ఉందని, రాజకీయ లబ్ధి కోసం దైవ కార్యాల్లో తాము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. కల్తీ జరిగిందని స్వయంగా దర్యాప్తు సంస్థలే చెబుతుంటే.. ఇంకా బుకాయించడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

శాసనమండలిలో నెయ్యి కల్తీ అంశంపై చర్చ జరుగుతుండగా.. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ హెరిటేజ్ డెయిరీని ఉద్దేశించి కొన్ని ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి లోకేశ్ తక్షణం స్పందిస్తూ.. సభలో ఏదైనా ఆరోపణ చేయాలంటే కచ్చితమైన ఆధారాలతో రావాలని హితవు పలికారు. టెండర్ల ప్రక్రియలో నిబంధనల ప్రకారం ఎల్-1 (అత్యంత తక్కువ ధరకు కోట్ చేసిన వారు) వచ్చిన వారికే కాంట్రాక్టు దక్కుతుందని, ఎల్-3లో ఉన్నవారికి టెండర్లు రావని కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుందని చురకలంటించారు.

తమ కుటుంబానికి వెంకటేశ్వరస్వామి అంటే ఎంతో భక్తి అని లోకేశ్ ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘గత పదేళ్లుగా నా కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా (మార్చి 21న) తిరుమలలో అన్నదానం చేస్తున్నాం. మాకు ప్రోటోకాల్ అర్హత ఉన్నప్పటికీ, నిబంధనలను గౌరవించి ఏనాడూ మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లలేదు. సామాన్య భక్తుల్లాగే క్యూ కాంప్లెక్స్ ద్వారానే స్వామివారిని దర్శించుకున్న ఘనత మా కుటుంబానిది. కానీ మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కనీసం డిక్లరేషన్ పై సంతకం చేయడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి మీరు మా భక్తిని ప్రశ్నిస్తారా?’’ అని లోకేష్ నిలదీశారు.

లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే అంశంపై సీబీఐ ఛార్జిషీట్ లో చాలా స్పష్టంగా పేర్కొందని లోకేష్ సభ దృష్టికి తెచ్చారు. గతంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగిందని అంగీకరించిన విషయాన్ని గుర్తుచేశారు. మార్కెట్ లో స్వచ్ఛమైన నెయ్యి ధర ఎంత ఉందో గూగుల్ చేస్తే ఎవరికైనా తెలుస్తుందని, కానీ కేవలం రూ.300కే నెయ్యిని సప్లై చేయాలంటే కల్తీ చేయక తప్పదని విశ్లేషించారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ అపచారాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేయడం దారుణమన్నారు. కల్తీ జరగలేదని చెప్పడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని, కలియుగ దైవంతో ఆటలాడుకున్న మిమ్మల్ని ఆ దేవుడే వదిలిపెట్టడని మంత్రి లోకేశ్ హెచ్చరించారు.
Nara Lokesh
Tirumala laddu
laddu prasadam
TTD
YV Subba Reddy
Heritage Dairy
Andhra Pradesh
Tirupati
Deity
Declaration

More Telugu News