Paradise Hotel Hyderabad: హైదరాబాద్ హోటళ్లలో కల్తీ నెయ్యి కలకలం!

Paradise Hotel Hyderabad Ghee Adulteration Scandal
  • హైదరాబాద్‌లోని ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి వాడినట్లుగా రిపోర్టు
  • జీహెచ్‌ఎంసీ సేకరించిన నమూనాలు అసురక్షితమని ల్యాబ్ రిపోర్ట్
  • ల్యాబ్ రిపోర్ట్‌ను సవాలు చేసిన నెయ్యి తయారీ సంస్థ
  • మరోసారి పరీక్షల కోసం నమూనాలను మైసూర్ పంపిన అధికారులు
హైదరాబాద్ నగరంలోని ఆహార ప్రియులకు షాక్ తగిలేలా, ప్రముఖ ప్యారడైజ్ హోటల్‌లో కల్తీ నెయ్యి వాడుతున్నట్లు వార్తలు కలకలం రేపుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలో నగరంలో కల్తీ నెయ్యికి సంబంధించి ఇది మూడో ఘటన కావడం గమనార్హం. మార్కెట్ లో నెయ్యికి ఉన్న డిమాండ్ నేపథ్యంలో కొన్ని సంస్థలు రసాయనాలు, కూర నూనెలతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నాయనే ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలో సాధారణ తనిఖీల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు  ఖైరతాబాద్ జోన్‌లోని ఐమాక్స్ వద్ద ఉన్న ప్యారడైజ్ హోటల్‌లో, మరో రెండు చోట్ల తనిఖీలు నిర్వహించారు. హోటల్‌లో వాడుతున్న 'సుధీర్ ఇండస్ట్రీస్' బ్రాండ్‌కు చెందిన నెయ్యి నమూనాలను సేకరించి, నాచారంలోని రాష్ట్ర ఆహార భద్రత ప్రయోగశాలకు పంపించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఆ నెయ్యి తినడానికి సురక్షితం కాదని (అన్‌సేఫ్) తేలినట్లు సమాచారం. 

అయితే, ప్రభుత్వ ల్యాబ్ ఇచ్చిన రిపోర్టును నెయ్యి తయారీ సంస్థ సవాలు చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించారు. ఆ నమూనాలను మరోసారి పరీక్షించేందుకు మైసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ ప్రయోగశాలకు పంపినట్లు తెలిసింది. మైసూర్ ల్యాబ్ నివేదికలో కూడా నెయ్యి కల్తీ అని, ప్రమాదకరమని తేలితే తయారీ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం మైసూర్ నుంచి రాబోయే తుది నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
 
Paradise Hotel Hyderabad
Paradise Hotel
Hyderabad
Adulterated Ghee
GHMC
Food Safety
Sudheer Industries
Khairatabad
Imax Hyderabad
Ghee Adulteration

More Telugu News