Apple iPhone: భారత్ ఎగుమతుల్లో ఐఫోన్ సంచలనం.. డీజిల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం

iPhone becomes Indias top single export item
  • 2025లో భారత్ నుంచి 23 బిలియన్ డాల‌ర్ల‌ విలువైన ఐఫోన్ల ఎగుమతి
  • దేశ ఎగుమతుల్లో డీజిల్‌ను దాటి అగ్రస్థానానికి చేరిన స్మార్ట్‌ఫోన్లు
  • భారత్‌లో రెండంకెల వృద్ధి సాధించామని చెప్పిన యాపిల్ సీఈవో
  • దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచిన‌ ఐఫోన్ 16
భారత ఎగుమతుల రంగంలో యాపిల్ ఐఫోన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 సంవత్సరంలో దేశం నుంచి అత్యధికంగా ఎగుమతి అయిన వస్తువుగా ఐఫోన్ నిలిచింది. పరిశ్రమ వర్గాల డేటా ప్రకారం గతేడాది భారత్‌లోని ఫ్యాక్టరీల నుంచి సుమారు 23 బిలియన్ డాలర్ల  (దాదాపు రూ.1.90 లక్షల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం అమెరికాకు వెళ్లాయి. దీంతో మొదటిసారిగా ఆటోమోటివ్ డీజిల్‌ను వెనక్కి నెట్టి స్మార్ట్‌ఫోన్లు దేశంలోనే టాప్ ఎగుమతి కేటగిరీగా అవతరించాయి.

2025 క్యాలెండర్ సంవత్సరంలో భారత్ నుంచి మొత్తం 30.13 బిలియన్ డాల‌ర్ల‌ విలువైన స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి కాగా, అందులో ఏకంగా 76 శాతం వాటా యాపిల్ ఐఫోన్లదే కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం, చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునే వ్యూహాలు ఈ అద్భుత వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. యాపిల్ కోసం కేటాయించిన ఐదేళ్ల పీఎల్‌ఐ విండో ఈ ఏడాది మార్చితో ముగియనుంది.

ప్రస్తుతం దేశంలో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో మూడు, ఫాక్స్‌కాన్ ఆధ్వర్యంలో రెండు చొప్పున మొత్తం ఐదు ఐఫోన్ అసెంబ్లీ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. వీటికి అనుబంధంగా అనేక ఎంఎస్ఎంఈలు సహా 45 కంపెనీలు విడిభాగాలను సరఫరా చేస్తున్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్లోనూ వినియోగదారుల తీరు మారుతోంది. 2025లో భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ 16 నిలిచిందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది.

భారత్‌లో డిసెంబర్ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో ఆదాయం సాధించామని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇటీవల వెల్లడించారు. "భారత్ వంటి మార్కెట్లలో రెండంకెల బలమైన వృద్ధిని చూశాం" అని ఆయన తెలిపారు. ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ అయిన భారత్‌లో ఐఫోన్, మ్యాక్, ఐప్యాడ్‌లతో పాటు సర్వీసుల విభాగంలోనూ రికార్డులు సృష్టించామని పేర్కొన్నారు. ఈ నెల 26న ముంబైలో మరో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
Apple iPhone
iPhone exports India
India smartphone exports
Tim Cook
Make in India
PLI scheme
Foxconn
Tata Group
Counterpoint Research
iPhone 16

More Telugu News