Ambati Rambabu: ఆ ఒక్కటి తప్ప... జైలు జీవితం బాగా ఎంజాయ్ చేశాను: అంబటి రాంబాబు

Ambati Rambabu Enjoyed Jail Life Except for One Thing
  • బెయిల్ పై జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు
  • జైలులో బాత్రూంలో జారిపడటం మినహా తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని వ్యాఖ్య
  • తనను చంద్రబాబు, లోకేశ్ టార్గెట్ చేశారని తీవ్ర ఆరోపణలు
  • కూటమి ప్రభుత్వంపై పోరాటం ఆగదని స్పష్టీకరణ
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 18 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలు జీవితం తనలో మరింత పట్టుదలను నింపిందని, దాన్ని తాను శిక్షగా కాకుండా ఒక శిక్షణగా భావించానని అన్నారు. అయితే, ఈ సమయంలో తాను ఎదుర్కొన్న ఏకైక ఇబ్బంది బాత్రూంలో జారిపడటమేనని, అది మినహా జైలు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశానని వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వంపై తన పోరాటం ఇకపై రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు.

"నన్ను 18 రోజులు జైల్లో పెడితే భయపడతానని చంద్రబాబు, లోకేశ్ అనుకున్నారేమో. కానీ, ఈ అంబటి రాంబాబు ఎవరికీ భయపడే ప్రశ్నే ఉద్భవించదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డాను. నన్ను జైల్లో పెట్టాలని వారు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు, ఇప్పుడు అవకాశం దొరికింది, లోపల పెట్టారు. కానీ కాలం మళ్లీ తిరిగొస్తుంది. వారు చేసిన పాపానికి మూల్యం చెల్లించక తప్పదు" అని అంబటి హెచ్చరించారు. జైలు తనలో మరింత కసిని, పట్టుదలను పెంచిందని, ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

దాడి వెనుక చంద్రబాబు, లోకేశ్

తన ఇంటిపై జరిగిన దాడి ఘటనను పూర్తిగా చంద్రబాబు, లోకేశ్ పర్యవేక్షించారని అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. "సుమారు ఏడు గంటల పాటు నా ఇంటిపై దుండగులు దాడి చేస్తుంటే పోలీసులు అక్కడే ఉన్నారు. వారి సమక్షంలో, వారి రక్షణలోనే ఈ దాడి జరిగింది. నన్ను రక్షించాల్సిన పోలీసులే 'సార్, మీరు గోడ దూకి పారిపోండి' అని చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇది ఆటవిక రాజ్యం కాదా?" అని ఆయన ప్రశ్నించారు. దాడి చేసిన వారికి వెంటనే బెయిల్ వచ్చిందని, బాధితుడినైన తనకు మాత్రం 18 రోజుల తర్వాత బెయిల్ లభించిందని అన్నారు. తన భార్యాబిడ్డలను, మనవళ్లను భయభ్రాంతులకు గురిచేశారని, తనను చంపడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు.

జైల్లో సాధారణ ఖైదీగానే..

జైల్లో అధికారులు నిబంధనల ప్రకారమే వ్యవహరించారని, తాను ప్రత్యేక సౌకర్యాలు ఏవీ కోరలేదని అంబటి తెలిపారు. "జైల్లో పెట్టే ఆహారమే తిన్నాను. అది నాకు నచ్చలేదు. కానీ కలకాలం తినను కదా? బయటి భోజనం కోసం కోర్టు అనుమతి ఇవ్వలేదు. అందుకే లోపలి భోజనమే చేశాను. అందుకే కొంచెం చిక్కినట్టు ఉన్నా, ఆరోగ్యంగానే ఉన్నాను. ఎలాంటి ఇబ్బంది లేదు" అని వివరించారు.

జగన్ నాయకత్వంలోనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని, ప్రాణం ఉన్నంతవరకు ఆయన వెంటే నడుస్తానని అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు జైల్లో పెట్టినా తాను వెనకడుగు వేయనని, ప్రజాస్వామ్యబద్ధంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్చేంతవరకు తన పోరాటం ఆగదని ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై తనకు పూర్తి సమాచారం లేదని, అన్ని విషయాలు తెలుసుకుని గుంటూరులో రేపు విలేకరుల సమావేశంలో సమగ్రంగా మాట్లాడతానని ఆయన వెల్లడించారు.


Ambati Rambabu
Rajahmundry Central Jail
YS Jagan
Chandrababu Naidu
Andhra Pradesh Politics
TDP
YSRCP
Jail Life
Political Arrest
Guntur

More Telugu News