IAS Srilakshmi: ఐఏఎస్ శ్రీలక్ష్మికి భారీ షాక్ ఇచ్చిన సుప్రీం

IAS Srilakshmis Discharge Petition Dismissed in OMC Case
  • ఓఎంసీ కేసులో విచారణకు గ్రీన్ సిగ్నల్!
  • డిశ్చార్జ్ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు
  • పొరపాటును సవరిస్తున్నామంటూ కోర్టు వ్యాఖ్య
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) అక్రమ మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసు నుంచి తనను విముక్తి చేయాలని ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది.

సీబీఐ కీలక వాదనలు
ఈ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై సీబీఐ కోర్టులో బలమైన వాదనలు వినిపించింది. మైనింగ్ నిబంధనల్లోని 'క్యాప్టివ్ మైనింగ్' అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించి, అక్రమాలకు దారులు తెరిచారని సీబీఐ ఆరోపించింది. ఈ అక్రమ వ్యవహారంలో శ్రీలక్ష్మి కీలక పాత్ర పోషించారని, ఆ సమయంలోనే ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

పొరపాటును సవరిస్తున్నాం..
ఈ కేసును విచారించిన జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గతంలో ఈ కేసును వేరే కేసుగా భావించి పొరపాటున స్టే ఇచ్చాము. ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నాము. నిందితులు ఆ స్టేను ఇప్పటివరకు ఎంజాయ్ చేశారు’’ అని ధర్మాసనం పేర్కొంది. దీంతో, శ్రీలక్ష్మి ఇప్పుడు తప్పనిసరిగా కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
IAS Srilakshmi
OMC case
Obulapuram Mining Company
Illegal mining case
Supreme Court
CBI investigation
Telangana High Court
Captive mining
Mining regulations
Corruption case

More Telugu News