GITAM: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు రూ.15 కోట్లు డిపాజిట్ చేయండి.. గీతంకు సుప్రీంకోర్టు ఆదేశం

GITAM Ordered by Supreme Court to Deposit 15 Crore to TSSPDCL
  • గీతం పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు
  • ఉభయ పక్షాల హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకే ఈ మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • గీతం ఒక విద్యాసంస్థ అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామన్న సుప్రీంకోర్టు
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్), గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (గీతం) మధ్య కొనసాగుతున్న విద్యుత్ బకాయిల వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గీతం విద్యాసంస్థ నాలుగు వారాల్లోగా రూ.15 కోట్లను విద్యుత్ సంస్థ వద్ద డిపాజిట్ చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉభయ పక్షాల హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకే ఈ మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది. గీతం ఒక విద్యాసంస్థ అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, అందుకే తాత్కాలిక వెసులుబాటు కల్పిస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

వీబీసీ ఫెర్రో అలాయ్స్ సంస్థ చెల్లించాల్సిన రూ.118 కోట్ల విద్యుత్ బకాయిలను, ఆ సంస్థతో సంబంధం ఉన్న గీతం చెల్లించాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా.. వివాదం పరిష్కారం అయ్యే వరకు రూ.54 కోట్లు చెల్లించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వులను గీతం యాజమాన్యం ఈ నెల 5న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 

జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ అలోక్ అరాధేల్‌లతో కూడిన ధర్మాసనం నిన్న ఈ పిటిషన్‌ను విచారించింది. తమ వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే టీఎస్‌ఎస్పీడీసీఎల్ నోటీసులు జారీ చేసిందని గీతం వాదించింది. వాదనలు పరిశీలించిన ధర్మాసనం.. గీతం సంస్థ నాలుగు వారాల్లో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రధాన రిట్ పిటిషన్‌ను త్వరితగతిన విచారించి పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది. ఈ కేసుకు సంబంధించిన స్పెషల్ లీవ్ పిటిషన్‌తో పాటు ఇతర అనుబంధ పిటిషన్లపై విచారణను ముగించింది.
GITAM
GITAM University
TSSPDCL
Telangana electricity
electricity bill dispute
Supreme Court order
VBC Ferro Alloys
విద్యుత్ బకాయిలు
విద్యుత్ పంపిణీ సంస్థ

More Telugu News