ఉండవల్లిలో అరటితోటను సందర్శించిన బిల్ గేట్స్... ఏపీ వ్యవసాయంలో టెక్నాలజీని చూసి ఆశ్చర్యం
- సీఎం చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ క్షేత్రస్థాయిలో పర్యటన
- వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పరిశీలన
- టెక్నాలజీ వాడుతున్న రైతులను అభినందించిన సీఎం
- ఏఐతో రైతులకు సలహాలు అందిస్తున్నామని వెల్లడి
ఉండవల్లికి విచ్చేసిన బిల్ గేట్స్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రదర్శించి చూపించారు. అరటి తోటలో డ్రోన్ల సహాయంతో మందులు పిచికారీ చేసే విధానాన్ని బిల్ గేట్స్ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, తమ రైతులు సంప్రదాయాలను గౌరవిస్తూనే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందున్నారని, ఇది తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు.
"ఈ విషయాన్నే ఇవాళ ఉండవల్లిలో మిస్టర్ గేట్స్‌తో పంచుకున్నాం. పంటలు, మార్కెట్ ధరలు, నేల స్వభావం ఆధారంగా కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా రైతులకు కచ్చితమైన సలహాలు అందిస్తున్నాం. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని, సుస్థిర వ్యవసాయ పద్ధతులను కూడా చురుకుగా ప్రోత్సహిస్తున్నాం" అని చంద్రబాబు వివరించారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు అక్కడి రైతులను అభినందించారు.


