Chandrababu Naidu: బిల్ గేట్స్‌తో మళ్లీ సమావేశం కావడంపై సీఎం చంద్రబాబు స్పందన

Chandrababu Naidu Reacts to Meeting with Bill Gates Again
షార్ట్స్‌లో చూడండి
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత దాతృత్వవేత్త బిల్ గేట్స్ సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో 'స్వర్ణాంధ్ర 2047' విజన్‌పై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొని, రాష్ట్ర ప్రాధాన్యతా రంగాలపై బిల్ గేట్స్‌కు వివరించారు.

ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 1997లో తాను తొలిసారి బిల్ గేట్స్‌ను కలిసి ఐటీ రంగానికి సంబంధించిన తన విజన్‌ను పంచుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. 

"1997లో నేను తొలిసారి మిస్టర్ బిల్ గేట్స్‌ను కలిశాను. అప్పుడు ఆయనకు నా ఐటీ విజన్‌ను వివరించాను. ఆ రోజు ఒక టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను నిర్మించడంపై మా మధ్య మొదలైన సంభాషణ, ఇప్పుడు ఒక విస్తృత లక్ష్యంగా రూపాంతరం చెందింది. వినూత్న ఆవిష్కరణలను ఉపయోగించి పాలనలో మార్పులు తీసుకురావడం, ప్రజల జీవితాలను పెద్ద ఎత్తున మెరుగుపరచడమే ఆ లక్ష్యం.

ఈ రోజు అమరావతి సచివాలయంలో ఆయనతో మరోసారి భేటీ అయ్యాను. ఈ సందర్భంగా, నా స్వర్ణాంధ్ర 2047 విజన్‌ను ఆయన ముందు ఉంచాను. ఈ సమావేశంలో మా మంత్రులు, కార్యదర్శులు కూడా పాలుపంచుకుని ఆయనతో సంభాషించారు.

మా ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించాం. రాష్ట్ర ప్రజలకు సాధికారత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ఏయే మార్గాల్లో పనిచేయవచ్చో అన్వేషించాం. ఆనాటి మా సంభాషణ నేటి మా విస్తృత లక్ష్యాలకు పునాది వేయడం సంతోషంగా ఉంది" అని చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Bill Gates
Andhra Pradesh
Amaravati
Swarnandhra 2047
IT Vision
Gates Foundation
Technology Ecosystem
Governance
Social Media

More Telugu News