Kim Greenwood: పొరపాటున స్లీపర్ క్లాస్ టికెట్.. కెనడా టూరిస్టులకు భారత్‌లో మర్చిపోలేని అనుభూతి

Canadian Tourists India Sleeper Class Experience Shared by Kim Greenwood
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో పర్యటిస్తున్న కెనడాకు చెందిన జంటకు భారతీయ రైలులో ఓ విచిత్రమైన, మధురమైన అనుభవం ఎదురైంది. పొరపాటున ప్రైవేట్ క్యాబిన్ బదులు స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకోవడంతో, ఏడు గంటల ప్రయాణంలో వారికి నిద్రే కరువైంది. అయినప్పటికీ, తోటి ప్రయాణికుల ఆప్యాయత, పిల్లల అల్లరికి ముగ్ధులై, ఈ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేమంటూ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కెనడాకు చెందిన కిమ్ గ్రీన్‌వుడ్, తన స్నేహితుడితో కలిసి జల్గావ్ జంక్షన్ నుంచి చంద్రపుర వరకు 7 గంటల రైలు ప్రయాణం కోసం టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రశాంతంగా నిద్రపోవచ్చని భావించి స్లీపర్ క్యాబిన్ అనుకుని బుక్ చేయగా, అది అందరూ కలిసి ప్రయాణించే సాధారణ స్లీపర్ క్లాస్ అని రైలెక్కిన తర్వాత వారికి తెలిసింది. మొదట ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత అక్కడి వాతావరణంలో వారు పూర్తిగా లీనమైపోయారు.

కొద్దిసేపటికే వారి బెర్త్ చుట్టూ పిల్లలు చేరిపోయారు. విదేశీయులను చూడాలన్న కుతూహలంతో వారితో ఆటలు, మాటల్లో మునిగిపోయారు. తోటి ప్రయాణికులు తమ ఇంట్లో వండిన ఆహారాన్ని పంచుకోవడమే కాకుండా, స్టేషన్లలో ఆగినప్పుడు చాయ్, ఇతర తినుబండారాలు కొనిచ్చారని కిమ్ తన పోస్టులో పేర్కొన్నారు. "ఓ పెద్ద కుటుంబంలా అందరూ కలిసిపోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఈ 7 గంటల నిద్రలేని ప్రయాణంలో పొందిన అనుభూతి వెలకట్టలేనిది" అని ఆమె వివరించారు.

తాము పొందిన ఈ ప్రత్యేక అనుభవాన్ని "మా జీవితంలోనే అత్యంత సరదా రాత్రి" అంటూ కిమ్ గ్రీన్‌వుడ్ షేర్ చేసిన వీడియో, పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
Go Back to Shorts
Kim Greenwood
Canada tourists India
Indian Railways sleeper class
India travel experience
Viral travel story
Jalgaon Junction
Chandrapur
Cultural experience India
Foreigners in India

More Telugu News