భారీ ప్యాకేజీతో పౌల్ట్రీ రంగానికి కొత్త ఊపిరి: అచ్చెన్నాయుడు
- అచ్చెన్నాయుడిని కలిసిన పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు
- పౌల్ట్రీ రంగం అభివృద్ది కోసం రూ. 657 కోట్ల ప్యాకేజీ ప్రకటించామన్న అచ్చెన్న
- ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడి
రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేసి, పౌల్ట్రీ రైతులకు పూర్తి స్థాయి అండగా నిలిచేందుకు 'ఏపీ పౌల్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ 2026–29'కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిసిన సందర్భంగా మాట్లాడిన మంత్రి... ఈ రంగం అభివృద్ధికి రూ.657 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించామని వెల్లడించారు.
ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను పెంచడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కోళ్ల ఫారాలు, హేచరీల రుణాలపై 4 శాతం వడ్డీ రాయితీ, లో-టెన్షన్ ఫారాలకు యూనిట్‌కు రూ.3.75, ఫీడ్ మిక్సింగ్ యూనిట్లకు రూ.4.75 టారిఫ్ క్రమబద్ధీకరణ కల్పించామన్నారు. కొత్త ఎన్విరాన్‌మెంట్ కంట్రోల్డ్ (EC) పౌల్ట్రీ షెడ్లకు రూ.25 లక్షల వరకు, పాత షెడ్ల ఆధునీకరణకు రూ.20 లక్షల వరకు 25 శాతం క్యాపిటల్ సబ్సిడీ అందించే అవకాశం కల్పించామని తెలిపారు.
బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ ద్వారా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏటా 2,720 మదర్ పౌల్ట్రీ యూనిట్లను స్థాపిస్తామన్నారు. పీపీపీ విధానంలో విజయవాడ, విశాఖపట్నం, చిత్తూరు కేంద్రాలుగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, ఫీడ్ వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్రంతో చర్చించి నూక బియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.