Suryakumar Yadav: అతడొచ్చేశాడు... టీమిండియా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పిన సూర్యకుమార్ యాదవ్

Abhishek Sharma Returns Suryakumar Yadav Announces Good News for Team India
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్‌లో రేపు (ఫిబ్రవరి 15) పాకిస్థాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియా అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడుతున్నాడని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం నాడు జరగనున్న దాయాదుల సమరంపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సూర్యకుమార్ ఈ విషయాన్ని ధృవీకరించాడు.

అమెరికాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా కడుపు నొప్పితో బాధపడిన అభిషేక్ శర్మ.. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. దీంతో నమీబియాతో జరిగిన గత మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. అతని స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ శాంసన్ 8 బంతుల్లో 22 పరుగులు చేసి రాణించాడు. ఇప్పుడు అభిషేక్ పూర్తి ఫిట్‌నెస్‌తో జట్టులోకి తిరిగి రానున్నాడు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించి సూర్యకుమార్ మాట్లాడుతూ, "రేపు అభిషేక్ ఆడతాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. ఇది మరో సాధారణ మ్యాచ్ కాదు, ఒక ప్రత్యేకమైన సందర్భం. మేం తరచుగా వాళ్లతో ఆడడం లేదు కాబట్టి ఒత్తిడి సహజం" అని అన్నాడు. మ్యాచ్‌కు వర్షం ముప్పుపై స్పందిస్తూ, "వాతావరణం మన చేతుల్లో లేదు. మంచి క్రికెట్ ఆడటమే మా నియంత్రణలో ఉంది. ఇక్కడి పరిస్థితులు మాకు అలవాటే" అని తెలిపాడు.

విభిన్నమైన బౌలింగ్ యాక్షన్‌తో వార్తల్లో నిలుస్తున్న పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌పై కూడా సూర్య స్పందించాడు. "సిలబస్‌లో లేని ప్రశ్న వచ్చినా వదిలేయలేం కదా. అతనికి దాసోహం అనే ప్రసక్తే లేదు. మేమంతా ఈ సవాల్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని ధీమా వ్యక్తం చేశాడు. టోర్నీలో బ్యాటింగ్ కాస్త తడబడిన మాట వాస్తవమేనని, అయితే దానికి సాకులు చెప్పలేమని అంగీకరించాడు. టీ20 ప్రపంచకప్‌లలో ఇప్పటివరకు ఇరు జట్లు 8 సార్లు తలపడగా, భారత్ 7 సార్లు విజయం సాధించింది.
Go Back to Shorts
Suryakumar Yadav
Abhishek Sharma
India vs Pakistan
T20 World Cup
Cricket
Usman Tariq
Sanju Samson
Colombo
Rohit Sharma

More Telugu News