Sanathnagar TIMS: మార్చిలో అందుబాటులోకి సనత్‌నగర్ టిమ్స్.. వేగవంతమైన ఏర్పాట్లు

Sanathnagar TIMS Ready for March Launch
  • సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభానికి సన్నాహాలు
  • అన్ని పనులు ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని డెడ్‌లైన్
  • ఆసుపత్రిని పరిశీలించిన రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
  • త్వరలో 100 మంది వైద్య, పారామెడికల్ సిబ్బంది నియామకం
  • పరికరాల ఏర్పాటు, ట్రయల్ రన్స్ ప్రక్రియ వేగవంతం
హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో నిర్మించిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మార్చి నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ఆదేశాల మేరకు రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఆసుపత్రిని సందర్శించి పనుల పురోగతిని సమీక్షించారు. అన్ని పనులను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు స్పష్టమైన గడువు విధించారు.

వైద్య విద్య డైరెక్టర్ (DME), టీజీఎంఎస్ఐడీసీ, ఎంహెచ్ఐడీసీ, ఆర్&బీ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ (MEIL) ప్రతినిధులతో కలిసి ఆయన ఆసుపత్రిలోని అన్ని అంతస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, సెంట్రల్ స్టెరైల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ (CSSD)లో జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఈ నెలాఖరులోగా 200 ఆక్సిజన్ లైన్లు, 65 నర్సింగ్ స్టేషన్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఎమర్జెన్సీ వార్డు కోసం ఆర్వో ప్లాంట్ వంటి కీలక పనులను పూర్తి చేసి ట్రయల్ రన్స్‌కు సిద్ధం చేయాలని ఆదేశించారు. అదేవిధంగా లాండ్రీ సేవలు, కర్టెన్లు, ఐసీయూ బెడ్ రైలింగ్స్, ఆసుపత్రి అంతటా సైన్‌ బోర్డులు వంటివి ఏర్పాటు చేయాలని ఎంహెచ్ఐడీసీని ఆదేశించారు. తమ పరిధిలోని వైద్య పరికరాలన్నీ ఇప్పటికే అమర్చినట్లు నిర్మాణ సంస్థ తెలపగా, మరో 540 రకాల వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని ఎంహెచ్ఐడీసీ అధికారులు వివరించారు.

ఆసుపత్రి కార్యకలాపాలను ప్రారంభించేందుకు వీలుగా, పరికరాల ట్రయల్ రన్స్ పర్యవేక్షణకు వెంటనే వైద్య, సాంకేతిక సిబ్బందిని నియమించాలని వైద్య విద్య డైరెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఆయన, మొదటి విడతలో 100 మంది వైద్య, పారామెడికల్, హౌస్‌కీపింగ్ సిబ్బందిని ఫిబ్రవరి 12 నుంచి 28 మధ్య నియమిస్తామని తెలిపారు. ఆసుపత్రి భవనాన్ని ఆరోగ్య శాఖకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే 1,059 గదులకు గాను 225 గదులను తనిఖీ చేశామని అధికారులు వెల్లడించారు. తనిఖీ పూర్తయిన గదుల్లో ఫిబ్రవరి 12 నుంచి బెడ్లు, ఇతర పరికరాలను అమర్చనున్నారు.

 
Sanathnagar TIMS
TIMS Hyderabad
Telangana Institute of Medical Sciences
Super Speciality Hospital
Medical Equipment
Hospital Construction
Healthcare
Megha Engineering
DME
Hospital Inauguration

More Telugu News