Ajit Pawar: వైఎస్సార్, బాలయోగి నుంచి అజిత్ పవార్​ దాకా.. విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు

From Sanjay Gandhi To Ajit Pawar Indian Leaders Lost To Aviation Accidents
  • మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి
  • బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తూ కూలిపోయిన విమానం
  • ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో ఐదుగురు దుర్మరణం
  • గతంలో వైఎస్సార్, బాలయోగి వంటి నేతలూ ఇలాంటి ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయిన వైనం
మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అజిత్ పవార్ (Ajit Pawar) విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పుణె జిల్లాలోని బారామతిలో మంగళవారం ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ధృవీకరించింది.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం అజిత్ పవార్ మంగళవారం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయల్దేరారు. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో మరో నలుగురు కూడా ఉన్నారు. బారామతి విమానాశ్రయం సమీపంలోకి రాగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించారు. అయితే, అదుపుతప్పి విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. కిందపడిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు విమానంలోని మిగతా నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషాద ఘటన, గతంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పలువురు ప్రముఖులు ఇలాంటి వైమానిక ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలను గుర్తుకు తెస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు కీలక నేతలు హెలికాప్టర్ ప్రమాదాల్లోనే మరణించడం తెలుగు ప్రజలను తీవ్రంగా కలిచివేసింది.

నల్లమల అడవుల్లో వైఎస్ మరణం
2009 సెప్టెంబర్ 2న అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తుండగా నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సుమారు 24 గంటల గాలింపు తర్వాత ఆయన మృతదేహాన్ని గుర్తించారు. 

హెలికాప్టర్‌ కూలడంతో జీఎంసీ బాలయోగి మృతి
అంతకుముందు 2002 మార్చి 3న లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి పశ్చిమ గోదావరి జిల్లాలో హెలికాప్టర్ కూలిపోవడంతో ప్రాణాలు విడిచారు.

ఇదే తరహాలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా 2001లో ఉత్తరప్రదేశ్‌లో విమాన ప్రమాదంలో మరణించారు. 1980లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీలో విమానం నడుపుతూ ప్రమాదానికి గురై మరణించారు. అలాగే, 2011లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు, 2005లో హర్యానా మంత్రి, పారిశ్రామికవేత్త ఓపీ జిందాల్ కూడా హెలికాప్టర్ ప్రమాదాల్లోనే కన్నుమూశారు. 

ఎయిర్ఇండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం మృతి
గతేడాది అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సైతం మరణించిన వారిలో ఉన్నారు. ఇప్పుడు అజిత్ పవార్ మరణం ఈ జాబితాలో చేరడం మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Ajit Pawar
Ajit Pawar death
Maharashtra politics
helicopter accident
YSR Reddy
GMC Balayogi
plane crash
Indian politicians death
Dorcee Khandu
Vijay Rupani

More Telugu News