డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు: సీఎం చంద్రబాబు ఆదేశాలు

Chandrababu Naidu orders industrial incentives via escrow accounts from December
  • చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం
  • పారిశ్రామిక రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాల చెల్లింపు విధానంలో కీలక మార్పు
  • ఈ విధానం ద్వారా పారదర్శకతను పెంచడమే లక్ష్యం
  • నిధుల వినియోగాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చన్న సీఎం
రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాల చెల్లింపు విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది డిసెంబరు నుంచి పరిశ్రమలకు ఇచ్చే అన్ని రకాల ప్రోత్సాహకాలను (ఇన్సెంటివ్స్) నేరుగా ప్రత్యేక ఎస్క్రో ఖాతాల్లో జమ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం ద్వారా పారదర్శకతను పెంచడంతో పాటు, నిధుల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక ప్రగతికి ప్రోత్సాహకాలు తప్పనిసరి అని, అయితే వాటిని ఎంతవరకు ఇవ్వగలమనే అంశంపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలని సీఎం సూచించారు.

బుధవారం (ఆగస్టు 12) నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ భేటీలో పరిశ్రమలు, ఇంధనం, ఐటీ ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి మొత్తం 25 ప్రాజెక్టులకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ.2,08,406 కోట్ల విలువైన పెట్టుబడులు రానుండగా, తద్వారా ప్రత్యక్షంగా 21,627 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఇప్పటివరకు జరిగిన 20 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా మొత్తం 363 ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని, తద్వారా రూ.13.78 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.86 లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి రానున్నాయని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేవలం సంప్రదాయ పరిశ్రమలే కాకుండా భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి అధునాతన రంగాలపై దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించాల్సిన విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. పారిశ్రామిక ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి, వాటిపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. 

ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లకు కేవలం 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని, పోలవరం ఎడమ కాలువ ద్వారా గ్రావిటీపైనే విశాఖ పరిశ్రమలకు నీటిని అందిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని అడ్డుకునేందుకు కొందరు రాజకీయ నిరుద్యోగులు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కొత్త ప్రాజెక్టులను ఆయా ప్రాంతాల్లో నెలకొల్పేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న రక్షణ రంగ ప్రాజెక్టులు జాతికే గర్వకారణమని, పుట్టపర్తి సమీపంలో డిఫెన్స్, హిందూపురం వద్ద ఏరోస్పేస్ ప్రాజెక్టులు ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. 

మూలపేట పోర్టు నిర్మాణాన్ని డిసెంబరు నాటికి పూర్తి చేసి ప్రారంభించాలని ఆదేశించారు. రాయలసీమలో పండే ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తరలించేందుకు రోడ్, రైల్, పోర్టు కనెక్టివిటీని బలోపేతం చేయాలన్నారు. సెప్టెంబరు నాటికి 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్' కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.


Advertisement
Chandrababu Naidu
Andhra Pradesh Industrial Incentives
SIPB Meeting Andhra Pradesh
Escrow Accounts for Industries
MSME Parks Andhra Pradesh
AP Investment Projects 2024

More Telugu News