అంబటి రాంబాబు, మోదుగుల సహా 17 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
- డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసన ప్రదర్శన
- అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారంటూ అడ్డుకున్న పోలీసులు
- శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారంటూ కేసు నమోదు
మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ అనుమతి లేకుండా నిరసన ప్రదర్శన చేపట్టిన కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నూరి ఫాతిమా సహా పలువురు నేతలపై గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈనెల 10న గుంటూరులోని శంకరవిలాస్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ప్రదర్శనకు పోలీసులు ముందుగానే అనుమతి నిరాకరించారు. అయినా నిబంధనలను ఉల్లంఘించి, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ లెక్కచేయకుండా ర్యాలీ నిర్వహించారు. ప్రజా రవాణా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని పోలీసులు తెలిపారు.
ర్యాలీని నిలిపివేయాలని, సాధారణ ప్రజలకు ఆటంకం కలిగించవద్దని హెచ్చరించినా వైసీపీ శ్రేణులు పట్టుబట్టి ప్రదర్శన కొనసాగించాయని అరండల్‌పేట ఎస్‌ఐ ఈశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నూరి ఫాతిమా, రాజనారాయణతో పాటు మొత్తం 17 మంది వైసీపీ ముఖ్య నాయకులు, పలువురు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.