ఇండిగో విమానంలో పేలిన పవర్ బ్యాంక్.. టేకాఫ్‌కు ముందు కలకలం
- ఢిల్లీ-దిమాపూర్ ఇండిగో విమానంలో ఘటన
- టేకాఫ్ కోసం వెళ్తుండగా పవర్ బ్యాంక్‌కు నిప్పు
- వెంటనే స్పందించి మంటలను ఆర్పేసిన సిబ్బంది
- ప్రయాణికులంతా సురక్షితమని తెలిపిన ఇండిగో
ఇండిగోకు చెందిన 6ఈ 2107 విమానం ఢిల్లీ నుంచి దిమాపూర్‌కు బయల్దేరేందుకు సిద్ధమైంది. ఆ సమయంలో ఓ ప్రయాణికుడు తన పవర్ బ్యాంక్‌ను సీటు వెనుక ఉన్న పాకెట్‌లో పెట్టారు. విమానం కదులుతున్న సమయంలో ఆ పవర్ బ్యాంక్‌లో మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన క్యాబిన్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు.
ఈ ఘటనపై ఇండిగో విమానయాన సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుడి ఎలక్ట్రానిక్ పరికరంలో మంటలు చెలరేగిన కారణంగా విమానాన్ని తిరిగి బే వద్దకు తీసుకువచ్చినట్లు తెలిపింది. సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి కొన్ని క్షణాల్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారని పేర్కొంది. ఈ ఘటనలో ప్రయాణికులకు గానీ, సిబ్బందికి గానీ ఎలాంటి హాని జరగలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది. అయితే, ఆ సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే వివరాలను సంస్థ వెల్లడించలేదు.