కృష్ణా జిల్లాలో మంత్రి లోకేశ్‌కు బ్రహ్మరథం.. భారీ ర్యాలీతో హోరెత్తిన పెనమలూరు

Nara Lokesh gets grand welcome in Krishna district massive rally in Penamaluru
  • కృష్ణా జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌
  • పెనమలూరు నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం
  • ఈడుపుగల్లు నుంచి పునాదిపాడుకు భారీ ర్యాలీ
  • బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించనున్న లోకేశ్‌
  • టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు కృష్ణా జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పెనమలూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయనకు పార్టీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో కంకిపాడు మండలం ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు వద్ద మంత్రి లోకేశ్‌కు పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాశ్‌, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము తదితరులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

ఈడుపుగల్లు క్రాస్ రోడ్డు నుంచి పునాదిపాడు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. టీడీపీ జెండాలు చేతబూని, 'జై తెలుగుదేశం' నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ర్యాలీ పొడవునా మంత్రి లోకేశ్‌ ప్రజలకు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు.

పర్యటనలో భాగంగా మరికాసేపట్లో కంకిపాడు మండలం పునాదిపాడులో నూతనంగా నిర్మించిన బాలికల జూనియర్ కళాశాల భవనాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం కంకిపాడులోని అయానా కన్వెన్షన్‌లో జరిగే పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో లోకేశ్‌ పాల్గొంటారు.
Advertisement
Nara Lokesh
Penamaluru TDP Rally
Krishna District News
Telugu Desam Party
Bode Prasad
Nara Lokesh Penamaluru Visit

More Telugu News