ఏఐ మన విద్యా వ్యవస్థ గొంతు కోస్తోంది.. డిగ్రీలు కాగితాలుగానే మిగిలిపోతాయి: రాంగోపాల్ వర్మ ఆందోళన
- నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దుల కంటే ఏఐ వల్లే విద్యా రంగానికి ఎక్కువ హాని అన్న వర్మ
- ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు కనుమరుగవుతాయని హెచ్చరిక
- టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని సూచన
దేశంలో నీట్ పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దులు, విద్యార్థుల ఆత్మహత్యల కంటే కృత్రిమ మేధస్సు (ఏఐ) వల్ల విద్యారంగానికి ఎదురవుతున్న ముప్పే అత్యంత ప్రమాదకరమైనదని ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ సమస్యల వల్ల వ్యవస్థకు రక్తస్రావం మాత్రమే జరుగుతుంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం విద్యారంగ వ్యవస్థ గొంతు కోసేస్తోందని ఆయన ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు సమాచారం తక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు డిజిటల్ కాలుష్యం అనే వరద పారుతోందని... AI ఆ వరదనంతా మింగేసి మానవ మెదడు కంటే అత్యంత వేగంగా సమాధానాలు ఇస్తోందని ఆర్జీవీ పేర్కొన్నారు. 'కష్టపడి చదువుకుని సుఖంగా జీవించవచ్చు' అనే పాతకాలపు నమ్మకాన్ని AI వీధిలోకి లాగి కాల్చి చంపేసిందని ఆయన స్పష్టం చేశారు. మార్కులు, డిగ్రీలు, కంఠస్థం చేసే సామర్థ్యం కంటే వేగంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము మార్చుకోవడమే ఇప్పుడు ముఖ్యమని సూచించారు.
AI ఉపయోగించడం నేర్పించని ఏ చదువు అయినా వ్యర్థమేనని, AI సహాయంతో ఒక్క వ్యక్తి మాత్రమే డాక్టర్, లాయర్, ఇంజనీర్, సీఏ లాంటి బహుముఖ పాత్రలను మానవుల కంటే అత్యంత వేగంగా, కచ్చితత్వంతో నిర్వర్తించగలడని చెప్పారు. ఈ క్రమంలో ఇంజనీరింగ్, మెడిసిన్, లా, ఎంబీఏ చదివే విద్యార్థులు ఒక రకంగా ‘కసాయి ఖానా’ వైపు నడుస్తున్నారని, వారు సంపాదించే డిగ్రీలు కేవలం కాగితాలుగానే మిగిలిపోయి ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు కనుమరుగవుతాయని హెచ్చరించారు. AI ని ఉపయోగించేవారిగా మారతారా? లేక దానివల్ల ఉద్యోగాలు కోల్పోతారా? అనేదే మనముందున్న ఎంపిక అని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ వాస్తవాన్ని గ్రహించి మేల్కోవాలని ఆర్జీవీ పిలుపునిచ్చారు.