కేసీఆర్ దత్తత గ్రామంలో కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మక పథకం షురూ
- వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టిన మంత్రి పొంగులేటి
- మొదటి లబ్ధిదారు ఆగవ్వకు ఇంటి పట్టా, లక్ష రూపాయల చెక్కు అందజేత
- పర్యటనలో మంత్రితో పాటు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు
- యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకం అమలు
ఈ రోజు ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వాసాలమర్రి గ్రామానికి చేరుకున్నారు. ఆయన వెంట భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యుడు బీర్ల ఐలయ్య, ఆలేరు శాసనసభ్యుడు అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించిన మంత్రి, స్థానికులతో ముచ్చటించారు.
అనంతరం, ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మంత్రి పొంగులేటి అధికారికంగా ప్రారంభించారు. మొదటి లబ్ధిదారుగా ఎంపికైన ఆగవ్వ అనే మహిళకు ఇంటి స్థలం పట్టాతో పాటు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ఈ పథకాన్ని అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వాసాలమర్రి గ్రామంలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానికులలో హర్షాతిరేకాలు నింపింది. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన పేదలకు గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.