మాజీమంత్రి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై భూ కబ్జా కేసు
- 27.98 ఎకరాల అటవీ భూమి ఆక్రమించినట్టు ఆరోపణలు
- జీవ వైవిధ్యానికి రూ.కోటికి పైగా నష్టం వాటిల్లినట్లు నిర్ధారణ
- ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి కూడా నిందితులే
ఈ వ్యవహారంపై ఈ ఏడాది జనవరి 29న ప్రముఖ దినపత్రికలో 'అడవిలో అక్రమ సామ్రాజ్యం' పేరుతో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. దీనిపై విచారణ జరిపేందుకు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ మణికంఠ, ఫారెస్ట్ కన్జర్వేటర్ యశోదాబాయితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో జరిపిన విచారణలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు సుమారు 27.98 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించినట్టు నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా, ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఆ భూమిలో బోరును కూడా తవ్వినట్టు గుర్తించారు. ఈ అక్రమ కార్యకలాపాల వల్ల జీవవైవిధ్యానికి దాదాపు కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.
ప్రస్తుతం అధికారులు ఆక్రమణకు గురైన అటవీ ప్రాంతం చుట్టూ హద్దు రాళ్లను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రక్రియ మరో వారంలోపు పూర్తవుతుందని సమాచారం. అనంతరం, ఈ కేసుకు సంబంధించి పాకాల కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు, ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించిన నేపథ్యంలో, సంబంధిత అధికారులు దీనిపై తదుపరి చర్యల కోసం సమాలోచనలు జరుపుతున్నారు. ఈ అక్రమాలకు సహకరించినట్టుగా భావిస్తున్న ప్రభుత్వ అధికారుల వివరాలను కూడా ఆరా తీస్తున్నారని, వారిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.