ఏపీకి వస్తున్న మోదీ.. నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు
- ప్రారంభోత్సవానికి సిద్ధమైన భోగాపురం విమానాశ్రయం
- ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
- మోదీ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రాబోతున్నారు. ఆగస్టు 1న మోదీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రధాని పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, పారిశుద్ధ్యం, ఇతర ప్రజా అవసరాల పర్యవేక్షణ బాధ్యతలను నలుగురు ఐఏఎస్ అధికారులకు అప్పగిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ హెచ్ ఎం ధ్యాన చంద్ర, గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్‌లు ఈ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షించనున్నారు.
ఈ ఐఏఎస్ అధికారులకు సహాయంగా పనిచేసేందుకు వివిధ కార్పొరేషన్ల నుంచి 26 మంది నాన్-కేడర్ అధికారులను కూడా ప్రభుత్వం నియమించింది. నియామకమైన అధికారులందరూ తక్షణమే విజయనగరం జిల్లా కలెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రధాని రాక సందర్భంగా ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఎలాంటి లోటుపాట్లు రాకుండా సకల సదుపాయాలను సిద్ధం చేసేందుకు యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది.