పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ భారీ సహాయం... తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్
- పాకిస్థాన్‌కు 1 బిలియన్ అమెరికన్ డాలర్ల రుణం మంజూరు
- ఐఎంఎఫ్ నిర్ణయంపై రాజకీయ దుమారం
- పాక్ రుణ వ్యవహారంపై కాంగ్రెస్ విమర్శలు... బీజేపీ కౌంటర్
వివరాల్లోకి వెళితే, ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (ఈఎఫ్ఎఫ్) కింద పాకిస్థాన్‌కు 1 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.8,540 కోట్లు) రుణం మంజూరు చేసేందుకు ఐఎంఎఫ్ కార్యనిర్వాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ పరిణామంపై భారత రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగొయ్, పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రుణం మంజూరు చేయడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించారు. "పహల్గామ్ దాడి జరిగిన తర్వాత కూడా పాకిస్థాన్‌కు 1 బిలియన్ డాలర్ల రుణం ఆమోదించడం షాక్‌కు గురిచేయడమే కాకుండా, తీవ్ర నిరాశ కలిగించింది. ఈ రుణం పాకిస్థాన్‌లో శాశ్వత సైనిక పాలనను ప్రోత్సహించడానికే ఉపయోగపడుతుంది" అని ఆయన ‘ఎక్స్’ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఏప్రిల్ 29న పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ రుణం ప్రతిపాదన వచ్చినప్పుడు, దానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. అయితే, ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయిందని, మోదీ ప్రభుత్వం ఈ విషయంలో వెనకడుగు వేసిందని విమర్శించారు. వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటే, అది ప్రపంచానికి బలమైన సందేశాన్ని పంపి ఉండేదని అభిప్రాయపడ్డారు.
బీజేపీ కౌంటర్
కాంగ్రెస్ నాయకుల విమర్శలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్, పవన్ ఖేరాలు పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ అందించిన బెయిలౌట్ ప్యాకేజీపై అనవసర ప్రచారంలో మునిగి తేలుతున్నారని అన్నారు. తప్పుడు సమాచారంతో దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హిమంత బిశ్వశర్మ 'ఎక్స్' వేదికగా విమర్శించారు.