రూ.6,700 కోట్ల బకాయిల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారు: మంత్రి పయ్యావుల

CM Chandrababu gives nod to pending bills worth Rs 6700 crores told Payyavula
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ వర్గాలకు గుడ్ న్యూస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు జరపాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు సంక్రాంతి నేపథ్యంలో నేడు అత్యవసరంగా ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహించారు. ఈ కీలక సమావేశం కోసం రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్  హుటాహుటిన అనంతపురం నుంచి విజయవాడకు చేరుకున్నారు. 

పెండింగ్ బిల్లుల స్టేటస్ ను మంత్రి పయ్యావుల సీఎం చంద్రబాబుకు వివరించారు. ఉన్న నిధులను బిల్లుల రూపంలో చెల్లించేస్తే... ఇబ్బందులు వస్తాయని అధికారులు చెప్పారని, అయినప్పటికీ చంద్రబాబు బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారని, మొత్తంగా రూ. 6700 కోట్ల విడుదలకు ఆదేశించారని పయ్యావుల వెల్లడించారు. 

"వివిధ వర్గాలకు చెల్లించాల్సిన రూ. 6,700కోట్ల రూపాయల నిధుల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారు.  సంక్రాoతి కానుకగా విద్యార్థులు, పోలీసులు, ఉద్యోగులు, చిరు కాంట్రాక్టర్లకు ఈ మొత్తం బకాయిలు చెల్లిస్తున్నాం. 

ఉద్యోగులకు జీపీఎఫ్ కింద  రూ.519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల్లో ఒక ఇన్ స్టాల్ మెంట్ కింద రూ. 214 కోట్లు, సీపీఎస్ కు సంబంధించిన రూ. 300 కోట్లు, టీడీఎస్ కింద రూ. 265 కోట్లు చెల్లిస్తున్నాం.  ఉద్యోగులకు మొత్తంగా రూ. 1,300 కోట్లు విడుదల చేస్తున్నాం.  

ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేస్తున్నాం. చిరు కాంట్రాక్టర్లు రూ. 10 లక్షల లోపు బిల్లులు ఉన్న 26 వేల మందికి లబ్ధి చేకూరేలా రూ.586 కోట్లు విడుదల చేస్తున్నాం. అమరావతి రైతులకు కౌలు బకాయిలు రూ. 241 కోట్లు చెల్లిస్తున్నాం. 

చిరు వ్యాపారులు 6 వేల మందికి లబ్ధి చేకూరేలా రూ. 100 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు రూ. 500 కోట్లు, విద్యుత్ శాఖకు రూ. 500 కోట్లు విడుదల చేస్తున్నాం. 

జగన్ చేసిన రూ. 10 లక్షల కోట్ల అప్పును తీర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం ఆలోచనలు ఉన్నాయి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ నడవాల్సిన వ్యవస్థ ఎక్కడా ఆగకుండా జాగ్రత్త పడుతున్నాం. పడిపోయిన రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే దిశగా సీఎం పని చేస్తున్నారు" అని పయ్యావుల వివరించారు.
Go Back to Shorts
Pending Bills
Payyavula Keshav
Chandrababu
Sankranti

More Telugu News