ఫ్రాన్స్ లో 1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ అదృశ్యం!
- ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైన, నాశనంలేని కత్తిగా పేరు
- 100 అడుగుల ఎత్తయిన బండరాయిలో సగం దిగబడిన డురంగల్
- చోరీకి గురవడంపై స్థానికుల ఆందోళన.. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
డురండల్ గా పిలిచే ఆ ఖడ్గానికి ఫ్రెంచ్ ఎక్స్ క్యాలిబర్ అని కూడా పేరుంది. స్థానిక స్థల పురాణం ప్రకారం ఆ ఖడ్గానికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. ఒక్క వేటుతో రాతిని కూడా అది రెండుగా చీల్చగలదు. 8వ శతాబ్దంలో ఆ ఖడ్గాన్ని ఓ దైవదూత నాటి రోమన్ చక్రవర్తి చార్ల్ మేగ్నెకి అందించింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆ ఖడ్గాన్ని తన అత్యుత్తమ సైనికుడైన రోలాండ్ కు బహూకరించారు. అయితే యుద్ధంలో మరణించే ముందు రోలాండ్ ఆ ఖడ్గం శత్రువుల చేతికి చిక్కరాదని భావించి దాన్ని విరగ్గొట్టాలనుకున్నాడు. కానీ అది సాధ్యంకాకపోవడంతో అసహనానికి లోనై దాన్ని గాల్లోకి విసిరాడు. దీంతో ఆ కత్తి గాల్లో కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చివరకు రొకమడోర్ పట్టణంలోని రాతికొండలో దిగబడింది.
11వ శతాబ్దం నాటి ఫ్రెంచ్ సాహిత్యంలోనూ డురండల్ మాయాశక్తుల ప్రస్తావన ఉంది. ద సాంగ్ ఆఫ్ రోలాండ్ పేరిట ఉన్న ఓ పద్యం తాలూకు కాపీ ప్రస్తుతం ఆక్స్ ఫర్డ్ లోని బోడ్లియన్ లైబ్రరీలో ఉంది.