బెయిల్ ఇవ్వండి లేదా విషమైనా ఇవ్వండి: కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర గౌడ

బెయిల్ ఇవ్వండి లేదా విషమైనా ఇవ్వండి: కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర గౌడ

Pavithra Gowda cries in court and asks for bail or poison
  • రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ కన్నీటి పర్యంతం
  • జైలులో నైజీరియన్ మహిళల నుంచి వేధింపులున్నాయని ఆరోపణ
  • పవిత్ర హత్యకు కుట్ర జరుగుతోందని లాయర్ల ఆందోళన
  • బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన కోర్టు
కన్నడనాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్ర గౌడ.. మంగళవారం జరిగిన బెయిల్ విచారణ సందర్భంగా కోర్టులో కన్నీరుమున్నీరైంది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆమె "నాకు బెయిల్ మంజూరు చేయండి, లేదంటే చనిపోయేందుకు విషమైనా ఇవ్వండి" అంటూ న్యాయమూర్తిని వేడుకుంది.

బెంగళూరులోని 59వ సీసీహెచ్ కోర్టులో జరిగిన ఈ విచారణలో..  జైలులో నైజీరియన్ మహిళలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని పవిత్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ జైలులో పవిత్రను హత్య చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సిట్ తరఫు న్యాయవాదులు కోర్టు ఆదేశాల మేరకు ఆమెను ఇప్పటికే వేరే బ్యారక్‌కు మార్చామని న్యాయస్థానానికి వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను వాయిదా వేశారు.

గతంలో తాను ఉంటున్న బ్యారక్‌లో 30 మందితో కలిసి ఒకే టాయిలెట్ వాడాల్సి రావడం వల్ల అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నానని పవిత్ర పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు ఆమెను నలుగురైదుగురు మాత్రమే ఉన్న మరో బ్యారక్‌కు ఇటీవలే మార్చారు.

తల్లి ఆరోగ్యం, కుమార్తె సంరక్షణ, తన సొంత ఆరోగ్య సమస్యలను కారణంగా చూపుతూ పవిత్ర గౌడ నాలుగోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తనకు అసభ్యకర సందేశాలు పంపాడనే ఆరోపణలతో 2024 జూన్‌లో ఈ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో నటుడు దర్శన్ ఏ2 నిందితుడిగా ఉండగా, మొత్తం 17 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. కేసులో సహ నిందితుడైన ప్రదోష్ ఎస్.రావు అప్రూవర్‌గా మారేందుకు కోర్టు ఇటీవల అనుమతించింది. తాజా పరిణామాలతో పవిత్ర గౌడ జ్యుడీషియల్ కస్టడీ పరప్పన అగ్రహార జైలులోనే కొనసాగనుంది.
Advertisement
Pavithra Gowda
Renukaswamy murder case
Actor Darshan
Parappana Agrahara Jail
Pavithra Gowda bail plea
Kannada actress murder case

More Telugu News