మనస్సాక్షి అంగీకరించని వారు వందేమాతరం పాడకపోతే శిక్షించలేరు: సుప్రీంకోర్టు

మనస్సాక్షి అంగీకరించని వారు వందేమాతరం పాడకపోతే శిక్షించలేరు: సుప్రీంకోర్టు

Supreme Court says those who refuse to sing Vande Mataram on conscience grounds cannot be punished
  • కర్ణాటక గాయకుడు టీఎం కృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
  • జాతీయ గీతం కేసులో 1986 నాటి తీర్పును గుర్తుచేసిన ధర్మాసనం
  • చట్ట సవరణపై నాలుగు వారాల్లో స్పందన తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు
  • జాతీయ గీతంగా దేన్ని పరిగణించాలనే అంశంలోకి తాము వెళ్లడం లేదని స్పష్టీకరణ
జాతీయ గీతమైన వందేమాతరం ఆలపించడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం మనస్సాక్షి అంగీకరించని కారణంగా వందేమాతరం పాడటానికి నిరాకరించిన వారిపై శిక్షాత్మక చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం గీతంలోని ఆరు చరణాలను తప్పనిసరిగా ఆలపించాలన్న నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే చట్టానికి 2026లో చేసిన సవరణను, అలాగే హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను ఆయన సవాల్ చేశారు. ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం 1986 నాటి బిజోయ్ ఇమ్మాన్యుయేల్ కేసును గుర్తుచేసింది. ఆ కేసులో తమ మత విశ్వాసాల కారణంగా జాతీయ గీతాన్ని పాడటానికి నిరాకరించి, గౌరవ సూచకంగా నిలబడిన పాఠశాల విద్యార్థులకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. అదే సూత్రం ఈ కేసుకు కూడా వర్తిస్తుందని ధర్మాసనం సూచించింది. 

జస్టిస్ బాగ్చీ మాట్లాడుతూ.. "జాతీయ గీతం స్వరూపం, నిడివిని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 కింద లభించిన హక్కులను వినియోగించుకుంటూ, మనస్సాక్షి ప్రకారం అభ్యంతరం తెలిపే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం సరికాదు" అని పేర్కొన్నారు.

సవరించిన చట్టం ప్రకారం జాతీయ గీతం లేదా జాతీయ గీతాలాపనకు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగిస్తే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

అయితే, జాతీయ గీతంగా దేన్ని పరిగణించాలి, దాని స్వరూపం ఎలా ఉండాలి అనే అంశాల్లోకి తాము వెళ్లడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం మనస్సాక్షి ప్రకారం గీతాన్ని ఆలపించని వారిపై చర్యలు తీసుకోవచ్చా? లేదా? అనే అంశాన్ని మాత్రమే పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
Advertisement
Supreme Court
Vande Mataram
TM Krishna
National Song
Freedom of Conscience
Constitutional Rights

More Telugu News