తమిళనాడు హాస్టళ్ల మెనూలో బీఫ్.. మంత్రి ప్రకటనతో రాజకీయ దుమారం

తమిళనాడు హాస్టళ్ల మెనూలో బీఫ్.. మంత్రి ప్రకటనతో రాజకీయ దుమారం

Vanni Arasu announcement on beef in Tamil Nadu hostel menu sparks political row
  • ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ చేర్చాలని యోచన
  • విద్యార్థుల విజ్ఞప్తి మేరకేనన్న మంత్రి వన్ని అరసు
  • అందరితో చర్చించాకే నిర్ణయమని స్పష్టీకరణ
  • ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని పుతియ తమిళగం పార్టీ డిమాండ్
తమిళనాడులోని ప్రభుత్వ విద్యార్థి హాస్టళ్ల మెనూలో బీఫ్ (గొడ్డు మాంసం) చేర్చే అంశం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కొందరు విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక న్యాయ శాఖ మంత్రి వన్ని అరసు తెలపడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మంగళవారం చెన్నై సైదాపేటలోని ఎం.సి. రాజా సోషల్ జస్టిస్ హాస్టల్‌ను తనిఖీ చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు చికెన్, మటన్ అందిస్తున్నామని, సోమవారాల్లో బిర్యానీ కూడా వడ్డిస్తున్నామని తెలిపారు. అయితే, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన కొందరు విద్యార్థులు.. మటన్ ధర చాలా ఎక్కువగా ఉందని, తమ ఇళ్లలో కూడా తినరని, కాబట్టి దాని స్థానంలో బీఫ్‌ను మెనూలో చేర్చాలని కోరినట్లు మంత్రి వివరించారు.

ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, భిన్నాభిప్రాయాలు ఉన్నందున విద్యార్థులు, అధికారులతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యార్థుల అభిప్రాయాల మేరకు ఉప్మా, కిచిడీ వంటి వాటిని తొలగించి, ఇడ్లీ, దోశ వంటివి మెనూలో చేర్చామని గుర్తుచేశారు.

ప్రతిపాదనపై వ్యతిరేకత
మంత్రి వన్ని అరసు ప్రకటనపై పుతియ తమిళగం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె. కృష్ణసామి తీవ్రంగా స్పందించారు. ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమిళనాడులో బీఫ్ సర్వసాధారణ ఆహారం కాదని, చికెన్, మటన్‌నే ఎక్కువ మంది తింటారని అన్నారు. ఇది కొందరి వ్యక్తిగత అభిరుచిని అందరి డిమాండ్‌గా చిత్రీకరించడమేనని విమర్శించారు. ఒకవేళ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే రాజకీయ పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మంత్రి తన పదవిని కూడా కోల్పోవాల్సి రావచ్చని హెచ్చరించారు.

ప్రస్తుతానికి ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, అటు విద్యార్థుల కోరిక, ఇటు రాజకీయ పార్టీల వ్యతిరేకతతో ఈ విషయం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.
Advertisement
Vanni Arasu
Tamil Nadu hostel menu
Beef in government hostels
K Krishnasamy
Tamil Nadu politics
Social Justice Department

More Telugu News