అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
- 100 మందిని విహార యాత్రకు పంపనున్నట్లు ప్రకటన
- క్రిస్మస్ గిఫ్ట్ గా ట్రిప్ ఖర్చులన్నీ తానే భరిస్తానని వెల్లడి
- ఎక్కడికి పంపాలంటూ ట్విట్టర్ లో పోల్ నిర్వహించిన విజయ్ దేవరకొండ
- దేశంలోని పర్వత ప్రాంతాల పర్యటనకే అభిమానుల ఓటు
అభిమానులను విహార యాత్రకు పంపించడానికి విజయ్ దేవరకొండ ఎంచుకున్న పర్యాటక ప్రాంతాలు.. దేశంలోని పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, సాంస్కృతిక ప్రాంతాల పర్యటన, దేశంలోని ఎడారి ప్రాంతాల పర్యటన. ట్విట్టర్ లో నిర్వహించిన ఈ పోల్ లో సుమారు 31 వేల మందికి పైగా ఆయన అభిమానులు పాల్గొన్నారు. అందులో మెజారిటీ శాతం.. అంటే 42.5 శాతం మంది పర్వత ప్రాంతాల పర్యటనకు ఓటేయగా, సముద్ర తీర ప్రాంతాల పర్యటనకు పంపాలని 24 శాతం మంది, సాంస్కృతిక పర్యటనే మేలంటూ 27.1 శాతం మంది అభిప్రాయపడ్డారు.
అయితే, విహార యాత్రకు పంపించే వంద మంది అభిమానులను ఎలా ఎంపిక చేస్తారనే విషయం మాత్రం విజయ్ దేవరకొండ వెల్లడించలేదు. ఈ పోల్ కు ఓటేయడంతో పాటు మీరు ఎంపిక చేసే వంద మందిలో ఉండాలంటే ఏం చేయాలంటూ పలువురు ట్విట్టర్ యూజర్లు విజయ్ దేవరకొండకు ప్రశ్నలు సంధించారు. క్రిస్మస్ పండుగకు ఇదే బెస్ట్ గిఫ్టంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్ చేశారు. విజయ్ ఎక్కడుంటే అక్కడ ప్రేమను పంచుతాడంటూ మరికొందరు అభిమానులు కామెంట్ చేశారు.