Russia: మా వ్యాక్సిన్ ను పంపాలని ఇండియా కోరింది... పరిశీలిస్తున్నామన్న రష్యా!

India and 20 Other Countries Show Intrest on Russia Vaccine
షార్ట్స్‌లో చూడండి
కరోనా మహమ్మారిని జయించే దిశగా తాము ముందడుగు వేశామని, తొలి వ్యాక్సిన్ తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ పనితీరుపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో పాటు, ఎన్నో దేశాల శాస్త్రవేత్తలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ, రష్యాపై నమ్మకంతో ఈ వ్యాక్సిన్ ను తమకు అందించాలని ఇండియా సహా 20 దేశాలు కోరాయి. ఈ విషయాన్ని రష్యా స్వయంగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇండియా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, బ్రెజిల్, మెక్సికో, టర్కీ, క్యూబా తదితర దేశాలు 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్ ను కోరాయని ఓ ప్రకటనలో తెలిపింది.

ఆర్డీఐఎఎఫ్ (రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్) సహకారంతో ఈ వ్యాక్సిన్ తయారు కాగా, నేడు తొలిసారిగా 2 వేల మంది ప్రజలకు దీన్ని ఇవ్వనున్నారు. సెప్టెంబర్ లో వ్యాక్సిన్ తయారీని భారీ ఎత్తున ప్రారంభించి, ఈ ఏడాది చివరకు 20 కోట్ల డోస్ లను తయారు చేసి అందించాలని రష్యా లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ వ్యాక్సిన్ ఫార్ములాను అందిస్తే, తాము కూడా తయారు చేస్తామంటూ పలు దేశాల ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని రష్యా పేర్కొంది.

కరోనాకు వ్యాక్సిన్ తమ దేశం నుంచి తొలిసారి రావాలన్న పట్టుదలను కనబరిచిన పుతిన్ ఆదేశాలతో ట్రయల్స్ కాల పరిమితిని కుదించిన సంగతి తెలిసిందే. సోవియట్ యూనియన్ కాలంలో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి శాటిలైట్ స్పుత్నిక్ పేరును ఈ వ్యాక్సిన్ కు పెట్టారు. ఇక వచ్చే ఐదేళ్ల వ్యవధిలో వివిధ దేశాల సహకారంతో సాలీనా 50 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేస్తామని ఆర్డీఐఎఫ్ అధినేత కిరిల్ దిమిత్రీవ్ తెలియజేశారు.

కాగా, అడినో వైరస్ సహకారంతో గమలేయా సంస్థ ఈ వ్యాక్సిన్ ను రష్యా ప్రభుత్వ సహకారంతో తయారు చేసింది. చైనాలోని కాన్ సినో తయారు చేసిన వ్యాక్సిన్ ప్రొటోటైమప్ ఆధారంగా ఈ వ్యాక్సిన్ ను గమలేయా రూపొందించింది. ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న గమలేయాకు చెందిన రీసెర్చర్లు, డైరెక్టర్లు, ఈ వ్యాక్సిన్ ప్రొటోటైప్ ను తమకు తాము ఇంజక్ట్ చేసుకోవడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. అయినా, ఈ విషయంలో ముందడుగు వేయాలనే నిర్ణయించుకున్న రష్యా, ట్రయల్స్ ను పూర్తి చేసి తొలి వ్యాక్సిన్ ను తామే అందించామని చెప్పుకుంది.
Go Back to Shorts
Russia
Putin
India
Vaccine

More Telugu News